అనుకోకుండా జరిగిన పొరపాటు క్షమించండి.. ఎంజీఆర్‌ వివాదానికి చెక్ పెట్టిన రాజేంద్ర ప్రసాద్

by Mallepaka Hamsa |

కాంతారావు గారిని ప్రశంసించే క్రమంలో ఆవేశంలో నోరుజారాను తప్ప, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అవమానించాలని నేను అనుకోలేదు.

అనుకోకుండా జరిగిన పొరపాటు క్షమించండి.. ఎంజీఆర్‌ వివాదానికి చెక్ పెట్టిన రాజేంద్ర ప్రసాద్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు, 'నటకిరీటి' రాజేంద్ర ప్రసాద్ గత కొన్ని రోజులుగా ఎంజీఆర్ (MGR) పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వార్తల్లో నిలిచారు. ఓ కార్యక్రమంలో తెలుగు నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరిస్తూ, తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్‌ను ఉద్దేశించి ‘వాడు, వీడు అని సంబోధించడమే కాకుండా, కాంతారావుని చూసి ప్యాంట్ తడిపేసుకుంటారంటూ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెను దుమారాన్నే రేపాయి. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై తమిళ చిత్ర పరిశ్రమ తీవ్రంగా స్పందించింది. రజనీకాంత్, నాజర్, విశాల్ వంటి స్టార్ నటులు రాజేంద్ర ప్రసాద్ తీరును తప్పుబట్టారు. ఒక లెజెండరీ నటుడిని, మాజీ ముఖ్యమంత్రిని అలా కించపరచడం సరికాదని, ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం రెండు పరిశ్రమల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది.

పరిస్థితి తీవ్రతను గమనించిన రాజేంద్ర ప్రసాద్ ఎట్టకేలకు ఒక వీడియో సందేశం ద్వారా బేషరతు క్షమాపణలు చెప్పారు. "తమిళ ప్రేక్షకుల మాదిరిగానే నేను కూడా ఎంజీఆర్‌ను దైవంలా భావిస్తాను. కాంతారావు గారిని ప్రశంసించే క్రమంలో ఆవేశంలో నోరుజారాను తప్ప, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అవమానించాలని నేను అనుకోలేదు. అది అనుకోకుండా జరిగిన పొరపాటు" అని వివరించారు. తాను చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్న రోజుల్లో ఎంజీఆర్ సీఎంగా ఉండేవారని, తాము నటిస్తుంటే ఆయన వచ్చి చూసేవారని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తిపై గౌరవం ఉందని చెబుతూ, తన వ్యాఖ్యల వల్ల బాధపడిన వారందరినీ క్షమించమని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని హామీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది.

Next Story