నేను ఎంతమందితో తిరిగితే నీకెందుకు.. రష్మీ ఫైర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-08 15:37:37  IST  )

నా వ్యక్తిగత జీవితంలో నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా, నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదు.

నేను ఎంతమందితో తిరిగితే నీకెందుకు.. రష్మీ ఫైర్
X

దిశ, సినిమా: యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో, తనపై వచ్చే విమర్శలను అంతే ధైర్యంగా ఎదుర్కొంటారని మరోసారి నిరూపించారు. ముఖ్యంగా ‘మహిళా దినోత్సవం’ రోజే ఆమెకు ఎదురైన ఒక చేదు అనుభవం, దానికి ఆమె ఇచ్చిన గట్టి కౌంటర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఓ నెటిజన్ రష్మీ క్యారెక్టర్‌ను కించపరుస్తూ సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన కామెంట్ చేశాడు. రష్మీకి మల్లెమాల ప్రొడక్షన్స్‌లోనూ, మరికొంతమందితోనూ అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ, ఇప్పుడు పతివ్రతలా నటిస్తోందంటూ అసభ్యకరంగా పోస్ట్ పెట్టాడు.

సాధారణంగా ఇలాంటి కామెంట్లను సెలబ్రిటీలు పట్టించుకోరు, కానీ రష్మీ మాత్రం ఈసారి అస్సలు తగ్గలేదు. సదరు నెటిజన్‌కు దిమ్మతిరిగేలా ఘాటు సమాధానం ఇచ్చింది. ‘‘ముందు నువ్వు అన్నదానికి ప్రూఫ్ చూపించు. నా వ్యక్తిగత జీవితంలో నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా, నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదు. నేను నిన్ను గానీ, నీ తండ్రిని గానీ, నీ కొడుకును గానీ పెళ్లి చేసుకునే వరకు, నేను ఎంతమందితో తిరిగినా అది నీ సమస్యే కాదు’’ అంటూ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా, కేవలం తన పేరు మాత్రమే ఎందుకు వాడుతున్నారని, తనకు ఎవరితో లింక్ ఉందని నువ్వు నమ్ముతున్నావో వారి పేర్లు కూడా బయటపెట్టాలని సవాల్ విసిరింది.

ఒకరి క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడాలనుకున్నప్పుడు, కేవలం మహిళలనే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. ‘‘ఎవరినైనా కించపరచాలనుకుంటే ఇద్దరి పేర్లూ బయటపెట్టండి, అప్పుడే అది న్యాయం అవుతుంది’’ అని రష్మీ స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం రోజున కూడా ఒక ఆడపిల్లపై ఇలాంటి దాడులు జరగడం పట్ల నెటిజన్లు కూడా రష్మీకి మద్దతు తెలుపుతూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులేనని, వారి వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని ఈ ఘటన ద్వారా ఆమె మరోసారి గుర్తు చేశారు.

Next Story