నా కల నెరవేరింది.. ఇది నా కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా భావిస్తున్నా: మాళవిక మోహనన్

by Mallepaka Hamsa |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రధాన పాత్రలో రాబోతున్న మూవీ ‘ది రాజాసాబ్’(The Raja Saab).

నా కల నెరవేరింది.. ఇది నా కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా భావిస్తున్నా: మాళవిక మోహనన్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రధాన పాత్రలో రాబోతున్న మూవీ ‘ది రాజాసాబ్’(The Raja Saab). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ డ్రామాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న మాళవిక మోహనన్, ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవాలను పంచుకుంది. ‘‘ప్రభాస్ భారతదేశపు అతిపెద్ద సూపర్‌స్టార్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ‘బాహుబలి’ సినిమా చూసిన నాటి నుంచే ఆయనతో కలిసి పనిచేయాలనే కోరిక నా మనసులో బలంగా ఉండేది.

ఆ మూవీ ఆయనను కేవలం ఒక స్టార్‌గా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడిగా నిలబెట్టింది. డార్లింగ్ నటన, వినయం, పని పట్ల నిబద్ధత నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆ కోరికతోనే ‘సలార్’ సినిమా సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను కలిసి మాట్లాడాను. ఆ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనే ఆశతో ప్రయత్నం కూడా చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు అది కుదరలేదు. అయినప్పటికీ, ప్రభాస్‌తో కలిసి పనిచేయాలనే నా ఆశ మాత్రం తగ్గలేదు. సరైన సమయం, సరైన కథ తప్పకుండా వస్తాయనే నమ్మకంతో ఎదురుచూశాను.

అలాంటి సమయంలోనే లక్కీగా‘ది రాజాసాబ్’ సినిమా కోసం నాకు పిలుపు రావడం నిజంగా సంతోషాన్ని కలిగించింది. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా భావిస్తున్నాను. ఈ సినిమా పూర్తిగా భిన్నమైన జానర్‌లో ఉండటమే కాకుండా, ఆయనను మరో కొత్త కోణంలో చూపించబోతోంది. ప్రభాస్ లాంటి స్టార్‌తో పనిచేయడం ప్రతి నటికి కలలాంటిదే. ‘ది రాజాసాబ్’ ద్వారా నా కల నెరవేరినట్టుగా అనిపిస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని, ప్రభాస్ అభిమానులను ఖచ్చితంగా అలరిస్తుందని నమ్మకం ఉంది’’ అని చెప్పింది.

Next Story