మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్ సెగ.. నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందంటూ సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-23 09:57:06  IST  )

మైక్రో ఫైనాన్స్ పేరుతో నా పేరు వాడుకుని కొందరు డబ్బులు వసూలు చేశారన్న వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్ సెగ..  నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందంటూ సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ప్రముఖ జానపద సింగర్ మంగ్లీ చుట్టూ గత కొద్దిరోజులుగా అల్లుకున్న మైక్రో ఫైనాన్స్ వివాదంపై ఎట్టకేలకు స్పందించి షాకింగ్ విషయాలు చెప్పారు. తన పేరు చెప్పి కొందరు సామాన్యుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్తలను ఖండించారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. ఈ మోసాలతో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. "మైక్రో ఫైనాన్స్ పేరుతో నా పేరు వాడుకుని కొందరు డబ్బులు వసూలు చేశారన్న వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ వ్యక్తులకు లేదా వారి వ్యాపారాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వృత్తిరీత్యా నేను చేసే ఈవెంట్స్ కోసం రోజుకు వందల మంది నన్ను, నా తమ్ముడిని సంప్రదిస్తుంటారు. కేవలం ఆ ప్రోగ్రామ్ ఆహ్వానాల వరకే మా పరిచయం ఉంటుంది తప్ప, వారి వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల గురించి మాకు ఏమాత్రం తెలియదు. ఇలాంటి మోసపూరిత విషయాల్లో నా పేరును వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం.

కావాలని కొందరు నా వ్యక్తిగత, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలకు మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు" అని మంగ్లీ వివరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెన్సీ కట్టల వీడియోలకు, తన ఇంటికి అస్సలు సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికే కొందరు కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "నాకు సింగింగ్ ఈవెంట్స్ తప్ప మరే ఇతర వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మకండి" అని అభిమానులను కోరారు. ఈ మోసపూరిత వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని ఆమె పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను కోరారు. తన పేరును అక్రమంగా వాడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగ్లీ ఇచ్చిన ఈ క్లారిటీతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పడినట్లయింది.

Next Story