వివాదంలో చిక్కుకున్న దివ్వెల మాధురి, తనూజ.. పోలీసుల ఎంట్రీతో హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం

by Mallepaka Hamsa |

తిరుమలలో తనూజ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం, దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది.

వివాదంలో చిక్కుకున్న దివ్వెల మాధురి, తనూజ..  పోలీసుల ఎంట్రీతో హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న తనూజ(Tanuja Puttaswamy), దివ్వెల మాధురి(Divvela Madhuri) తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. తిరుమలలో తనూజ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం, దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. తనూజ పుట్టినరోజు సందర్భంగా దివ్వెల మాధురితో కలిసి ఆమె తిరుమలకు వెళ్లారు. అయితే అక్కడ తాము బస చేసిన టీటీడీ అతిథి గృహంలోకి నిబంధనలకు విరుద్ధంగా బర్త్ డే కేక్‌ను తీసుకువెళ్లారు. అంతటితో ఆగకుండా, అక్కడ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో కొండపై ఇలాంటి ప్రైవేట్ వేడుకలు జరుపుకోవడాన్ని టీటీడీ ఎప్పుడో నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, వీరు ఆ నిబంధనలను బ్రేక్ చేస్తూ వేడుకలు చేసుకోవడమే కాకుండా, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రచారానికి వాడుకున్నారు.

ఈ విషయం కాస్త సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో టీటీడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై కేక్ కటింగ్ వంటి వేడుకలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఇలాంటి పనులు చేయడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. కేవలం పబ్లిసిటీ కోసం పవిత్ర క్షేత్రాన్ని వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తనూజ, దివ్వెల మాధురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సెలబ్రిటీ హోదాలో ఉండి బాధ్యతగా ప్రవర్తించాల్సింది పోయి, ఇలాంటి వివాదాలకు కారణం కావడంపై భక్తులు కూడా మండిపడుతున్నారు.

Next Story