‘కల్కి-2’ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు.. ఏ పాత్రలో నటిస్తున్నాడంటే?

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో శింబు ‘కల్కి-2’లో ఒక పవర్ ఫుల్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘కల్కి-2’ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు.. ఏ పాత్రలో నటిస్తున్నాడంటే?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘కల్కి-2’ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కల్కి మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే రెండో భాగం అత్యంత ఆసక్తికరంగా మొదలుకానుందని సమాచారం. ప్రభాస్ ఇంకా సెట్స్‌లోకి అడుగుపెట్టకముందే.. లెజెండరీ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లపై కీలక సన్నివేశాలను చిత్రబృందం చిత్రీకరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణే, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఉండగా, తాజాగా మరో సెన్సేషనల్ అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో శింబు ‘కల్కి-2’లో ఒక పవర్ ఫుల్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఒక కీలక సన్నివేశంలో శింబు ఎంట్రీ ఉంటుందని, అది థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. అయితే, ఆయన పాత్ర పురాణాలకు సంబంధించిందా లేక భవిష్యత్తు కాలానికి చెందిన యోధుడిదా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. క్లైమాక్స్‌లో శింబు ఇచ్చే ఎంట్రీ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందని చిత్రబృందం బలంగా నమ్ముతోంది. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శింబు లాంటి టాలెంటెడ్ నటుడు తోడవడంతో, తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మొదటి భాగంలో కమల్ హాసన్ యాస్కిన్ పాత్రతో మెప్పించగా, ఇప్పుడు శింబు ఎంట్రీతో తమిళ తంబీలు ఖుషీ అవుతున్నారు. భారీ వ్యయంతో, విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ‘కల్కి-2’ 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Next Story