యూట్యూబ్ నుంచి ‘కేడీ: ది డెవిల్’ ట్రైలర్ తొలగింపు.. అసలు విషయం చెప్తూ మేకర్స్ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

యూట్యూబ్ నుంచి ‘కేడీ: ది డెవిల్’ ట్రైలర్ తొలగింపు.. అసలు విషయం చెప్తూ మేకర్స్ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: కన్నడ యాక్షన్ స్టార్ ధృవ సర్జా హీరోగా, దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’ ఇప్పుడు టాలీవుడ్, శాండల్‌వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ 30న భారీ స్థాయిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, రిలీజ్‌కు ముందే వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ప్రమోషన్ల కోసం మేకర్స్ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ అవుతుండటంతో చిత్ర యూనిట్ అయోమయంలో పడింది. ముందుగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘సర్కె చూనార్ తేరీ సర్కే’ అనే ఐటమ్ సాంగ్ దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి స్టెప్పులు, పాటలోని కొన్ని పదాలు అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడ్డారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ రావడంతో, చిత్రబృందం వెంటనే స్పందించి ఆ పాటను ప్లాట్‌ఫామ్స్ నుండి తొలగించాల్సి వచ్చింది. ఒక వివాదం చల్లారకముందే ఇప్పుడు ట్రైలర్ రూపంలో మరో చిక్కు వచ్చి పడింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘కేడీ: ది డెవిల్’ ట్రైలర్, కేవలం ఒక్క రోజులోనే యూట్యూబ్ నుండి అదృశ్యమైంది. సెన్సార్ బోర్డ్ ఇంకా అనుమతి ఇవ్వని, ధ్రువీకరించని కొన్ని సున్నితమైన సన్నివేశాలను పొరపాటున ట్రైలర్‌లో చేర్చడమే దీనికి కారణమని సమాచారం. సెన్సార్ నిబంధనలు ఉల్లంఘించామనే వార్తలు రావడంతో మేకర్స్ అప్రమత్తమయ్యారు. యూట్యూబ్ నుంచి ట్రైలర్‌ను తొలగించడంతో పాటు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ఈ వివాదంపై నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పందిస్తూ.. "సర్టిఫికేషన్ ప్రక్రియలో ఉన్న అన్-వెరిఫైడ్ కంటెంట్ పొరపాటున ట్రైలర్‌లో పబ్లిష్ అయ్యింది. దీన్ని గుర్తించి వెంటనే వీడియోను తొలగించాం. సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా త్వరలోనే సవరించిన ట్రైలర్‌ను మళ్ళీ అప్‌లోడ్ చేస్తాం. ఈ పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నాం" అని పేర్కొంది. వరుస వివాదాలు సినిమాపై నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయా లేక పబ్లిసిటీకి ప్లస్ అవుతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story