- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay: ‘జననాయగన్’ లీకేజీ కలకలం.. ఆరుగురు అరెస్ట్.. ఫార్వర్డ్ చేస్తే జైలుకే అంటూ మూవీ టీమ్ వార్నింగ్
లీకైన కంటెంట్‌ను ఎవరైనా డౌన్‌లోడ్ చేసినా, సోషల్ మీడియా లేదా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన కెరీర్‌లో ఆఖరి చిత్రంగా నటిస్తున్న ‘జననాయగన్’ను పైరసీ సమస్యలు చుట్టుముట్టాయి. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలకమైన పాటతో పాటు, సుమారు 5 నిమిషాల సీన్, ఓ పాట ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు వస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై ఉన్న భారీ అంచనాలను ఈ లీకేజీ దెబ్బతీసే అవకాశం ఉందని చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ లీకేజీ వ్యవహారంపై చిత్ర నిర్మాతలు వెంటనే అలర్ట్ అయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో విచారణ జరిపి, ఈ పైరసీకి పాల్పడినట్లు భావిస్తున్న ఆరుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
వీరి వద్ద నుంచి కొన్ని డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఫుటేజ్ ఎక్కడి నుంచి లీక్ అయింది? దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా, ఈ సంఘటనపై చిత్రబృందం తరపు న్యాయవాది సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు, పైరసీ రాయుళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "లీకైన కంటెంట్‌ను ఎవరైనా డౌన్‌లోడ్ చేసినా, సోషల్ మీడియా లేదా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఫార్వర్డ్ చేసిన వ్యక్తులను కూడా గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తాం" అని నోటీసుల్లో పేర్కొన్నారు. పైరసీని ప్రోత్సహించడం నేరమని, అభిమానులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కాగా.. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే, మమిత బైజు, ప్రియమణి వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే, సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియలో వస్తున్న జాప్యం వల్ల సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ లోపే పైరసీ సెగలు తగలడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. అయినప్పటికీ, తమ అభిమాన హీరో చివరి సినిమాను వెండితెరపైనే చూస్తామని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు.






