లివర్ క్యాన్సర్.. హెచ్చరిక సంకేతాలు ఇవే..

by Sujitha Rachapalli |

లివర్ క్యాన్సర్ అనేది కాలేయంలోని కణాలు అసాధారణంగా పెరిగి కణితులుగా మారే తీవ్రమైన వ్యాధి. ఇది ప్రాథమిక కాలేయ క్యాన్సర్ లేదా ఇతర భాగాల నుంచి వ్యాపించే సెకండరీ కావచ్చు. ప్రారంభ దశల్లో ఈ వ్యాధి లక్షణాలు సరిగ్గా కనిపించవు.

లివర్ క్యాన్సర్.. హెచ్చరిక సంకేతాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : లివర్ క్యాన్సర్ అనేది కాలేయంలోని కణాలు అసాధారణంగా పెరిగి కణితులుగా మారే తీవ్రమైన వ్యాధి. ఇది ప్రాథమిక కాలేయ క్యాన్సర్ లేదా ఇతర భాగాల నుంచి వ్యాపించే సెకండరీ కావచ్చు. ప్రారంభ దశల్లో ఈ వ్యాధి లక్షణాలు సరిగ్గా కనిపించవు. అందువల్ల చాలా మంది వ్యాధి ముదిరిన తర్వాతే గుర్తిస్తారు. కానీ కొంత మందిలో ప్రారంభ సంకేతాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలను గమనించి వెంటనే వైద్య సహాయం తీసుకుంటే.. త్వరగా రికవరీ పొందవచ్చని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఈ లక్షణాలు ఏమిటి? చూద్దాం.

1. బరువు తగ్గడం

ఆహారం, వ్యాయామం లేదా జీవనశైలి మార్పులు ఏమీ లేకుండా శరీర బరువు త్వరగా తగ్గడం. ఇది కాలేయం సరిగ్గా పని చేయకపోవడం, జీవకణాలు సరైన పోషకాలను గ్రహించలేకపోవడం వల్ల వస్తుంది. ఇది లివర్ క్యాన్సర్‌లో చాలా సాధారణమైన ప్రారంభ సంకేతం.

2. ఆకలి మందగించడం

ఎప్పటిలాగా ఆకలి లేకపోవడం లేదా తక్కువ ఆహారం తిన్నా కడుపు నిండినట్లు అనిపించడం కాలేయ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. కాలేయం జీర్ణ రసాలు ఉత్పత్తి చేయడంలో సమస్య ఏర్పడటం వల్ల ఇలా జరుగుతుంది.

3. పొత్తికడుపు నొప్పి

కుడి పక్క కడుపు పై భాగంలో నొప్పి, భారం లేదా వాపు అనిపించడం లివర్ క్యాన్సర్ లక్షణం. కాలేయం కుడి వైపు ఉండటం వల్ల ట్యూమర్ పెరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఒత్తిడి పెరుగుతుంది. కొందరికి భుజం లేదా వీపు వైపు నొప్పి వ్యాపించవచ్చు.

4. వికారం, వాంతులు

ఎప్పుడూ వికారం అనిపించడం లేదా తరచూ వాంతులు అవడం ఉంటే జాగ్రత్త పడాలి. కాలేయం టాక్సిన్స్‌ను సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. దీంతో వాంతులు, వికారం కలుగుతుంది.

5. అలసట, బలహీనత

ఎక్కువ నిద్రపోయినా లేదా విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గకపోవడం అనేది ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి టెస్ట్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇది శరీరంలో రక్తహీనత లేదా పోషకాల కొరత వల్ల వస్తుందని చెప్తున్నారు.

6. కడుపు వాపు

కాలేయం సరిగ్గా పని చేయకపోవడం వల్ల రక్త నాళాలలో ఒత్తిడి పెరరుగుతుంది. దీంతో కడుపులో ద్రవం పేరుకుపోతుంది. ఈ కారణంగా కడుపు వాపు వచ్చి.. పొట్ట పెద్దగా కనిపిస్తుంది.

7. కామెర్లు

చర్మం, కళ్ల కింద తెల్లని భాగం పసుపు రంగులోకి మారడం లివర్ క్యాన్సర్‌కు సంకేతం. మూత్రం గాఢ ముదురు రంగులో ఉండటం, మలం తెల్లగా ఉండటం, దురద వంటివి ఉంటే.. జాగ్రత్త వహించాలంటున్నారు నిపుణులు. ఇది కాలేయం బిలిరుబిన్ అనే పదార్థాన్ని సరిగా ప్రాసెస్ చేయలేకపోవడం వల్ల వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన సంకేతం. తరచుగా జ్వరం రావడం.. సులభంగా గాయాలు ఏర్పడటం లేదా రక్తస్రావం.. కడుపులో గట్టి గడ్డ మాదిరిగా అనిపించడం.. శరీరంపై నీలి మచ్చలు లేదా రక్త నాళాలు కనిపించడం కూడా లివర్ క్యాన్సర్‌కు సంకేతం అంటున్నారు నిపుణులు.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

హెపటైటిస్ B లేదా C వైరస్ ఉన్నవారికి లివర్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక ఆల్కహాల్ వాడకం.. ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా సిర్రోసిస్ ఉన్నవారికి కూడా రిస్క్ ఎక్కువ. అంతేకాదు డయాబెటిస్, ఊబకాయం, కుటుంబ చరిత్ర ఉన్నవారికి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.

Next Story