సాయి పల్లవిని సీతగా చూడగానే షాకయ్యా.. రణ్‌బీర్ కపూర్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

షూటింగ్ మొదటి రోజు తను సీతమ్మ గెటప్‌లో ఉండగా చూడగానే షాకయ్యాం. నేను, డైరెక్టర్ నితేష్ తివారీ ఒకరినొకరు చూసుకున్నాం.

సాయి పల్లవిని సీతగా చూడగానే షాకయ్యా.. రణ్‌బీర్ కపూర్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విజువల్ వండర్ ‘రామాయణ’ (పార్ట్ 1) గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించి లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ నగరాల్లో జరిగిన ప్రత్యేక ఈవెంట్లలో హీరో రణ్‌బీర్ కపూర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి గురించి రణ్‌బీర్ ప్రశంసల వర్షం కురిపించారు. "సాయి పల్లవి ఎంత గొప్ప నటి అన్నది మనందరికీ తెలిసిందే. తను అద్భుతమైన నటి మాత్రమే కాదు, ఎంతో సాధించింది. షూటింగ్ మొదటి రోజు తను సీతమ్మ గెటప్‌లో ఉండగా చూడగానే షాకయ్యాం. నేను, డైరెక్టర్ నితేష్ తివారీ ఒకరినొకరు చూసుకున్నాం. ఈ పాత్రకు సాయి పల్లవి కంటే మంచి ఛాయిస్ మరొకటి ఉండదని మాకు అప్పుడే అర్థమైపోయింది" అని రణ్‌బీర్ చెప్పుకొచ్చారు.

ఇక రావణుడి పాత్ర పోషిస్తున్న కన్నడ స్టార్ యష్ గురించి మాట్లాడుతూ.. "రావణుడి పాత్రకు ఒక ప్రత్యేకమైన ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి. యష్‌కు ఉన్న స్టార్‌డమ్ ఆ పాత్రకు నిండుతనాన్ని తెచ్చింది" అని అన్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌లో సాయి పల్లవిని పూర్తిగా చూపించకపోయినా, చివర్లో రావణుడిగా యష్ తన 'పుష్పక విమానం' వైపు నడుచుకుంటూ వెళ్లే బ్యాక్ షాట్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఈ సినిమాను సుమారు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో మొదటి భాగం 2026 అక్టోబర్ (దీపావళి) కానుకగా విడుదల కానుంది. ఇక రెండో భాగం 2027 దీపావళికి రాబోతోంది. రణ్‌బీర్, సాయి పల్లవిలతో పాటు సన్నీ డియోల్, రవి దూబే వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ పౌరాణిక చిత్రం ఇండియన్ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story