గుర్తింపు కోసం ఆరాటపడి లక్షల్లో ఖర్చు చేశా.. సమీరా రెడ్డి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

నేను సక్సెస్ అయ్యానని ప్రపంచానికి చూపించుకోవడానికి అప్పట్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఛానెల్ జాకెట్లు, లూయిస్ విట్టన్ బ్యాగులు కొన్నాను.

గుర్తింపు కోసం ఆరాటపడి లక్షల్లో ఖర్చు చేశా.. సమీరా రెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో తన గ్లామర్‌తో మెప్పించిన నటి సమీరా రెడ్డి, ఇటీవల తన కెరీర్ ప్రారంభంలో చేసిన ఆర్థిక తప్పిదాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, అందరికంటే ప్రత్యేకంగా కనిపించడానికి అనవసరమైన ఖర్చులు చేశానని ఆమె అంగీకరించారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సమీరా మాట్లాడుతూ.. ‘‘నేను సక్సెస్ అయ్యానని ప్రపంచానికి చూపించుకోవడానికి అప్పట్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఛానెల్ జాకెట్లు, లూయిస్ విట్టన్ బ్యాగులు కొన్నాను. దాదాపు ₹2.5 లక్షల విలువైన జాకెట్, ₹4 లక్షల వరకు ఉండే హ్యాండ్‌బ్యాగుల కోసం భారీగా ఖర్చు చేశాను. అప్పట్లో ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చే హీరోయిన్లపైనే అందరి కళ్లూ ఉండేది. అక్కడ మనం వేసుకున్న బట్టలు, పట్టుకున్న బ్యాగులను బట్టే మన స్థాయిని అంచనా వేసేవారు అందుకే టాప్ స్టార్‌లా కనిపించాలని అవన్నీ కొన్నా కానీ నా వ్యక్తిగత ఇష్టం కోసం కొన్నవి కావు. గుర్తింపు కోసం ఆరాటపడి లక్షల్లో ఖర్చు చేశా" అని ఆవేదన వ్యక్తం చేశారు.

సెలిబ్రిటీలు ఎయిర్‌పోర్ట్ లో కనిపించినప్పుడు ట్రెండీగా ఉండాలనే ఒత్తిడి తనపై కూడా ఉండేదని, అందుకే దాదాపు ₹1.7 లక్షల విలువైన టోట్ బ్యాగ్‌ను కొన్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సంపాదించిన డబ్బును ఇలాంటి వస్తువులపై ఖర్చు చేయడం కంటే.. బంగారం లేదా మరేదైనా ఆస్తిపై పెట్టుబడి పెట్టి ఉంటే బాగుండేదని ఆమె ఇప్పుడు భావిస్తున్నారు. సుమారు పదమూడేళ్ల క్రితమే తాను ఈ ఆడంబరాల ప్రపంచం నుంచి బయటకు వచ్చానని సమీరా తెలిపారు. ఇప్పుడు తనకు సింప్లిసిటీ అంటేనే ఇష్టమని, ఎదుటివారి నుంచి వచ్చే గుర్తింపు కంటే తన మనసుకి నచ్చినట్లు ఉండటమే గొప్ప అని ఆమె పేర్కొన్నారు. కేవలం గ్రామర్ కోసమే లక్షలు ఖర్చు చేయడం కంటే మానసిక ప్రశాంతత ముఖ్యమని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story