తెలుగు రాకపోవడంతో సిగ్గుగా అనిపించింది.. షూటింగ్ సెట్‌లో ఎదురైన అనుభవాలు మర్చిపోలేను: దివ్యేందు శర్మ

by Mallepaka Hamsa |

సెట్స్‌లో అందరూ తెలుగు మాట్లాడుతుంటే, నాకు రాకపోవడంతో కొంత సిగ్గుగా అనిపించింది. అందుకే ఇప్పుడు నెమ్మదిగా తెలుగు భాషను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను.

తెలుగు రాకపోవడంతో సిగ్గుగా అనిపించింది.. షూటింగ్ సెట్‌లో ఎదురైన అనుభవాలు మర్చిపోలేను: దివ్యేందు శర్మ
X

దిశ, సినిమా: బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’లో మున్నా భయ్యాగా తనదైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు దివ్యేందు శర్మ. ఈ సిరీస్‌లో ఆయన పండించిన డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇప్పుడు ఈ టాలెంటెడ్ నటుడిని తమ సినిమాల్లోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దివ్యేందు, తన తెలుగు సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంతో దివ్యేందు శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ.. "తెలుగు రాష్ట్రాల్లో మీర్జాపూర్ సిరీస్‌కు ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుందని నేను అసలు ఊహించలేదు. ఇక్కడి ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు.

షూటింగ్ సమయంలో భాష పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. "సెట్స్‌లో అందరూ తెలుగు మాట్లాడుతుంటే, నాకు రాకపోవడంతో కొంత సిగ్గుగా అనిపించింది. అందుకే ఇప్పుడు నెమ్మదిగా తెలుగు భాషను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్ సెట్‌లో ఎదురైన అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేను" అని తన మనసులో మాట బయటపెట్టారు. విశేషం ఏమిటంటే, తన మొదటి తెలుగు సినిమా విడుదల కాకముందే దివ్యేందు రెండో ప్రాజెక్ట్‌ను కూడా దక్కించుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వరుసగా రామ్ చరణ్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో, త్రివిక్రమ్ లాంటి టాప్ దర్శకులతో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని దివ్యేందు సంతోషం వ్యక్తం చేశారు. మున్నా భయ్యా క్రేజ్ చూస్తుంటే భవిష్యత్తులో టాలీవుడ్‌లో ఆయన మరిన్ని బిజీ పాత్రల్లో కనిపించడం ఖాయమనిపిస్తోంది.

Next Story