నేను కేవలం కమర్షియల్ బొమ్మలా మిగిలిపోవాలని అనుకోలేదు.. రెజీనా సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-17 04:23:37  IST  )

నేను సౌత్ ఇండియా నుంచి వచ్చాననే కారణంతో నన్ను ఒక మూస (Stereotype) లో బంధించారు.

నేను కేవలం కమర్షియల్ బొమ్మలా మిగిలిపోవాలని అనుకోలేదు.. రెజీనా సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి రెజీనా కసాండ్రా(Regina Cassandra).. తన నటనతో, చురుకైన మాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ఉద్దేశంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు అక్కడ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 2019లో 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' (Ek Ladki Ko Dekha To Aisa Laga)సినిమాతో హిందీ తెరకు పరిచయమైన రెజీనా, అక్కడి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నిశ్శబ్ద పోరాటం చేస్తూనే ఉంది. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ‘‘నేను సౌత్ ఇండియా నుంచి వచ్చాననే కారణంతో నన్ను ఒక మూస (Stereotype) లో బంధించారు.

పరాయి వ్యక్తిలా చూశారు

నిజానికి చాలామంది ఉత్తరాది వారికంటే నా హిందీ చాలా స్పష్టంగా ఉంటుంది. నేను హిందీ రాయగలను, చదవగలను, అనర్గళంగా మాట్లాడగలను. నా ప్రతి సినిమాకు నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాను. అయినప్పటికీ, నన్ను అక్కడ ఒక పరాయి వ్యక్తిలా చూశారు’’ అని రెజీనా తన ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం మాటలతోనే కాకుండా, కొందరు తమ ప్రవర్తనతో కూడా తనను తక్కువ చేసి చూపిస్తూ కించపరిచేవారని, ఇది తన మనసును ఎంతో గాయపరిచిందని ఆమె వాపోయింది. ముఖ్యంగా ఉత్తరాది నటీమణులు దక్షిణాది సినిమాల్లో సులభంగా పాత్రలు దక్కించుకుంటుంటే, దక్షిణాది నటీమణులు మాత్రం హిందీలో పంజాబీ లేదా నార్త్ ఇండియన్ పాత్రలు చేయలేరనే ముద్ర వేయడం అన్యాయమని ఆమె ప్రశ్నించింది. ‘‘సినిమా అనేది విజువల్ మీడియా కాబట్టి, నటీమణుల రూపం మీదనే ఎక్కువ దృష్టి పెడతారు. నేను కేవలం కమర్షియల్ బొమ్మలా మిగిలిపోవాలని అనుకోలేదు.

పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి.

అందుకే రాకెట్ బాయ్స్, ఫర్జీ, ఇటీవల విడుదలైన జాట్ వంటి విభిన్నమైన ప్రాజెక్టులను ఎంచుకున్నాను’’ అని తెలిపింది. 16 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న రెజీనా, ఇప్పుడు పరిస్థితులను మరింత పరిణతితో ఎదుర్కొంటోంది. ‘‘పరిశ్రమలో ఉంటూ ప్రశాంతంగా ఉండటం అంత సులభం కాదు. కొన్ని విషయాలను మనం బలవంతంగా నేర్చుకోవాలి, మరికొన్నింటిని మర్చిపోవాలి. ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి. దక్షిణాది ప్రతిభను గుర్తించక తప్పని స్థితి బాలీవుడ్‌కు ఏర్పడింది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెజీనా భారీ చిత్రాలతో పాటు ఓటీటీలోనూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

యంగ్ బ్యూటీ అందాల దాడి.. తగ్గేదేలే అంటున్న మానస వారణాసి.

Next Story