హీరోగా పనికి రాను అనడంతో తట్టుకోలేక ఆవేశంలో కఠిన నిర్ణయం తీసుకున్నా: సిద్ధాంత్ చతుర్వేది

by Mallepaka Hamsa |

ఉంగరాల జుట్టుతో హీరో కాలేరు అని అవమానించి అవకాశాన్ని రిజెక్ట్ చేశారు.

హీరోగా పనికి రాను అనడంతో తట్టుకోలేక ఆవేశంలో కఠిన నిర్ణయం తీసుకున్నా: సిద్ధాంత్ చతుర్వేది
X

దిశ, సినిమా: ఎంతోమంది నటనపై ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి వెళ్తుంటారు. అయితే కొంతమంది ఊహించని విధంగా స్టార్స్ అవుతున్నప్పటికీ మరికొందరికి మాత్రం ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. అన్ని ఓకే అయినప్పటికీ ఏదో ఒక కారణం చెప్పి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి.. రెజెక్ట్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనల కారణంగా చాలామంది వెండితెరపై కనిపించకుండానే.. అసలు ఈ ఫీల్డ్‌నే వదిలేయాలని డిసైడ్ అవుతుంటారు. మరికొందరు మాత్రం తమ కోరిక నెరవేర్చుకునేందుకు ఎన్ని కష్టాలైనా పడుతూ.. అవమానించిని వారితోనే ప్రశంసలు పొందుతుంటారు. ఇక బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi)కి కూడా కెరీర్ తొలినాళ్లలో ఓ చేదు అనుభవం ఎదురైందట. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఓ పెద్ద సినిమాకు ఆడిషన్‌కు వెళ్లిన సమయంలో.. వర్క్‌షాప్స్‌ కూడా హాజరు కాగా.. ఆఫర్ దక్కిందని అన్నాడు. కాస్టింగ్ డైరెక్టర్‌కు బాగా నచ్చడం వల్ల మూడు, నాలుగు నెలలు తాను చాలా కష్టపడ్డానని కానీ స్క్రీన్ టెస్ట్ చేసి తొలగించడంతో షాక్ అయ్యానని తెలిపాడు.

అంతేకాకుండా.. ఉంగరాల జుట్టుతో హీరో కాలేరు అని అవమానించినట్లు గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత జుట్టును స్ట్రయిట్ చేసుకొని ఆడిషన్‌కు రమ్మని పిలవడంతో.. వాళ్లు చెప్పినట్లు చేసినప్పటికీ లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనతో చాలా బాధపడిపోయిన సిద్ధాంత్ నాకసలు జుట్టే వద్దని గుండు గీసుకున్నాడట. తన తల్లికి ఉంగరాల జుట్టు అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. రిజెక్ట్ చేశారనే కోపం, బాధ ఆవేశంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నాడు. జుట్టు విషయంలో అవమానించినప్పటికీ తాను ఇప్పుడు అదే హెయిర్ స్టైల్‌తో సినిమా పోస్టర్స్‌లో కనిపిస్తున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆయనను పొగుడుతున్నారు. సిద్ధాంత్ సినిమాల విషయానికొస్తే.. త్వరలో ‘దో దివానే షహర్ మే’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా.. రవి ఉద్యవార్ తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్స్‌లోకి రానుంది.

Next Story