ప్రతి ఓటమి ఒక పాఠమే.. సినిమాలు ఆగిపోవడంపై షనయా కపూర్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుందని నేను నమ్ముతాను. జరగాల్సింది ఎలాగైనా జరుగుతుంది.

ప్రతి ఓటమి ఒక పాఠమే.. సినిమాలు ఆగిపోవడంపై షనయా కపూర్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ కపూర్ కూతురు షనాయా కపూర్(Shanaya Kapoor) ఎట్టకేలకు వెండితెరపై మెరిసింది. అయితే, ఆమె సినిమా ప్రయాణం అనుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు. స్టార్ కిడ్ కావడంతో షనాయా కపూర్ ఎంట్రీపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉండేవి. మొదట కరణ్ జోహార్ నిర్మించాల్సిన ‘బేధడక్’ సినిమాతో ఆమె ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత విక్రాంత్ మాస్సే సరసన ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ (Ankhon Ki Gustakhian)సినిమాతో ఆమె తన కలను నెరవేర్చుకుంది. తన కెరీర్ ఆరంభంలో ఎదురైన అడ్డంకులు, పరాజయాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని షనయా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాజెక్టులు ఆగిపోవడంపై షనాయా స్పందిస్తూ.. ‘‘ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుందని నేను నమ్ముతాను. జరగాల్సింది ఎలాగైనా జరుగుతుంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ రోజు నా సినిమాలు ఆగిపోవడం నా మంచికే జరిగిందనిపిస్తోంది. ఆ విరామం నన్ను ఒక మంచి నటిగా తీర్చిదిద్దింది.ప్రతి ఓటమి ఒక పాఠంలా తీసుకుని.. కెమెరా ముందుకు వెళ్లని ఆ సమయంలో నేను నా నటనను మరింత మెరుగుపరుచుకున్నాను ’’ అని చెప్పుకొచ్చింది.

యూనివర్స్ ఒక మంచి ప్లాన్ వేసింది

కష్ట కాలంలో తన తండ్రి సంజయ్ కపూర్ తనకు అండగా నిలిచినట్లు తెలుపుతూ.. ‘‘పరిస్థితుల గురించి ఆలోచించకుండా, నీ పని మీద నువ్వు దృష్టి పెట్టు అని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. కెమెరా ముందు నటించే అవకాశం రాకపోతే, ఏదో ఒక సీన్ తీసుకుని నలుగురి ముందు ప్రదర్శించమని చెప్పేవారు. మన చేతుల్లో లేని విషయాల గురించి చింతించడం కంటే, మన పనిని మనం నిజాయితీగా చేసుకుంటూ వెళ్లడం ముఖ్యమని ఆయన నేర్పించారు’’ అని తన తండ్రి సలహాలను గుర్తుచేసుకుంది. ప్రస్తుతం బిజోయ్ నంబియార్ వంటి దర్శకులు, ఆదర్శ్ గౌరవ్ వంటి ప్రతిభావంతులైన నటులతో కలిసి పనిచేయడం, ఆనంద్ ఎల్ రాయ్ వంటి పెద్ద నిర్మాతలు తన ప్రాజెక్టుకు అండగా ఉండటం పట్ల షనాయా సంతోషం వ్యక్తం చేసింది. ‘‘ఇవన్నీ చూస్తుంటే నా కోసం యూనివర్స్ ఒక మంచి ప్లాన్ వేసిందని అర్థమవుతోంది. అందుకే అప్పుడు అలా జరిగి ఉండొచ్చు’’ అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం షనయా కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Next Story