రాజశేఖర్ కూతురిని అని తెలిసినా అలా చేయాలని చాలా ఒత్తిడి చేశారు.. శివాత్మిక సంచలన వ్యాఖ్యలు..

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-23 05:22:36  IST  )

కొన్ని సినిమాల్లో ఆమెను హీరోయిన్‌గా అనుకుని, ఆఖరి నిమిషంలో మరొకరిని తీసుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పింది.

రాజశేఖర్ కూతురిని అని తెలిసినా  అలా చేయాలని చాలా ఒత్తిడి చేశారు.. శివాత్మిక సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉంటే తొలి అవకాశం సులభంగా రావచ్చు కానీ, ఆ తర్వాత నిలదొక్కుకోవాలంటే మాత్రం సొంత ప్రతిభ, అదృష్టం రెండూ ఉండాలి. ఈ విషయాన్ని తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ ( Shivathmika Rajashekar ) మరోసారి గుర్తు చేశారు. ‘దొరసాని’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం అశోక్ గల్లా నటిస్తున్న ‘వింటారా సరదాగా’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న శివాత్మిక, ఒక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శివాత్మిక మాట్లాడుతూ.. ఒక స్టార్ హీరో కూతురు అయినప్పటికీ తనకు అవకాశాలు అంత సులభంగా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సినిమాల్లో ఆమెను హీరోయిన్‌గా అనుకుని, ఆఖరి నిమిషంలో మరొకరిని తీసుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పింది. దానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. సోషల్ మీడియాలో శివాత్మిక కంటే సదరు హీరోయిన్‌కు ఫాలోవర్స్ ఎక్కువగా ఉండటమేనని తెలిసి షాక్ అయ్యానని పేర్కొంది.

"నేను ఒక నటిని, నా నటనను చూసి నాకు అవకాశం ఇవ్వాలి. సోషల్ మీడియాలో నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారనేది నా ప్రతిభకు కొలమానం కాకూడదు. నేను నటిని కంటెంట్ క్రియేటర్‌ని కాదు," అని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఫాలోవర్లను పెంచుకోవాలంటూ తన మేనేజర్లు, ఇతర ఏజెంట్ల నుంచి నిరంతరం ఒత్తిడి ఉండేదని, కానీ తాను మాత్రం అవేమీ పట్టించుకోకుండా కేవలం నటనపైనే శ్రద్ధ పెట్టానని తెలిపింది. ఒక పాత్రకు నటి సెట్ అవుతుందా లేదా? ఆమెకు యాక్టింగ్ వస్తుందా లేదా? అనేది చూడాలి కానీ, ఇన్‌స్టాగ్రామ్ నెంబర్ల ఆధారంగా హీరోయిన్లను ఎంపిక చేయడం ఏంటని ఆమె ప్రశ్నించింది. వారసత్వం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఇలాంటి వింత పోకడల వల్ల అవకాశాలు కోల్పోవడం బాధాకరమని శివాత్మిక ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం నటనను నమ్ముకుని ముందుకెళ్తున్న ఈ బ్యూటీకి ‘వింటారా సరదాగా’ మూవీ ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

Next Story