నిఖిల్ ‘స్వయంభు’ సినిమా కోసం రంగంలోకి క్రేజీ బ్యూటీ.. ఈసారైనా అదృష్టం కలిసొచ్చేనా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-30 08:42:04  IST  )

అందాల తార ప్రీతి ముకుందన్(Preeti Mukundan) టాలీవుడ్‌లోకి ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

నిఖిల్ ‘స్వయంభు’ సినిమా కోసం రంగంలోకి క్రేజీ బ్యూటీ.. ఈసారైనా అదృష్టం కలిసొచ్చేనా?
X

దిశ, సినిమా: అందాల తార ప్రీతి ముకుందన్(Preeti Mukundan) టాలీవుడ్‌లోకి ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జలజ అనే పాత్రలో కనిపించిన ఆమె, గ్లామర్‌తో పాటు నటన పరంగా కూడా మంచి మార్కులే కొట్టేసింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమె ఖాతాలో హిట్ మాత్రం చేరలేదు. అయినప్పటికీ, తన లుక్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రీతి, ఇండస్ట్రీలో అవకాశాల పరంగా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతోంది. ఆ తర్వాత కోలీవుడ్ వైపు అడుగులు వేసిన ప్రీతి ముకుందన్, అక్కడ ‘స్టార్’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. అనంతరం టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన మంచు విష్ణు నటించిన మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.

భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్‌తో రూపొందిన ఈ చిత్రం నుంచి పెద్ద స్థాయిలో అంచనాలు ఉండగా, విడుదల తర్వాత మాత్రం మిక్స్‌డ్ టాక్‌ను మాత్రమే సొంతం చేసుకుంది. దీంతో మరోసారి ప్రీతి ఖాతాలో కమర్షియల్ హిట్ పడలేదు. అయినా సరే, ప్రీతి ముకుందన్‌కు అవకాశాల పరంగా మాత్రం కొదవలేదు అనే చెప్పాలి. తెలుగు, తమిళంతో పాటు మలయాళ చిత్రాల్లోనూ ఆమెకు వరుస ఆఫర్లు వస్తుండటం ఇండస్ట్రీలో ఆమెకున్న డిమాండ్‌కు నిదర్శనం. ప్రస్తుతం ఆమె ‘ఇదాయం మురళి’ అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా ప్రీతి ముకుందన్‌కు మరో బంపర్ ఛాన్స్ దక్కినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha)హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్–మైథలాజికల్ చిత్రం ‘స్వయంభు’లో ఆమెను స్పెషల్ సాంగ్ కోసం మూవీ మేకర్స్ సంప్రదించారని సమాచారం.

ఈ స్పెషల్ నంబర్ ద్వారా ప్రీతి గ్లామర్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేయనుందన్న టాక్ వినిపిస్తోంది. కాగా.. ‘స్వయంభు’(Swayambhu) చిత్రాన్ని దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తుండగా, పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ విజువల్స్‌తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించినప్పటికీ ప్రీతి ముకుందన్ ఖాతాలో సరైన సూపర్ హిట్ మాత్రం పడలేదు. అయితే వరుస అవకాశాలు, పెద్ద ప్రాజెక్టుల్లో భాగమవుతున్న నేపథ్యంలో ఈసారి అయినా అదృష్టం కలిసి వచ్చి ఆమెకు కెరీర్ టర్నింగ్ పాయింట్ దక్కుతుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

Read More..

రాజాసాబ్ ట్రైలర్‌పై టాలీవుడ్ హీరో ట్వీట్.. కుమ్మి పడేశారు ప్రభాస్ అన్నయ్య అంటూ..

Next Story