రజినీకాంత్, కమల్ తీరుపై చిన్మయి ఫైర్ .. సంచలనంగా మారిన పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-16 06:39:48  IST  )

తమిళనాడులో వేధింపులకు గురైన మహిళలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. మీరు మీ 'వేటగాళ్లను' కాపాడుకుంటూ ఉండండి. కానీ రేపు మీ పిల్లల దగ్గరకు ఎవరు రావచ్చో, ఎవరు ప్రమాదకరమో మీకు తెలియదు.

రజినీకాంత్, కమల్ తీరుపై చిన్మయి ఫైర్ .. సంచలనంగా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: వివాదాస్పద సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారు. ప్రముఖ కవి, గేయ రచయిత వైరముత్తుకు దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ ప్రకటించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుస పోస్టులతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నారు. వైరముత్తుకు శుభాకాంక్షలు తెలిపిన కోలీవుడ్ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్లపై చిన్మయి షాకింగ్ పోస్ట్ పెట్టింది. చిన్మయి తన ఎక్స్‌ (X) ఖాతా ద్వారా వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైరముత్తుపై గతంలో మీటూ ఉద్యమ సమయంలో చిన్మయితో పాటు పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అటువంటి వ్యక్తికి రజనీకాంత్, కమల్ హాసన్ వంటి పెద్దలు అభినందనలు తెలపడంపై చిన్మయి మండిపడ్డారు.

"నేను కూడా రజనీ సర్, కమల్ సర్ అభిమానినే.. కానీ గొప్ప మార్పులు తెస్తారని మనం నమ్మే వ్యక్తులు, మన కళ్ళముందే మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం బాధాకరం" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారు సినిమాలో చెప్పే డైలాగులు కేవలం తెరకే పరిమితమా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా కమల్ హాసన్ ఒక ఎంపీగా ఉండి కూడా ఇలాంటి ఘటనలపై మౌనంగా ఉండటాన్ని ఆమె తప్పుబట్టారు. మహిళల భద్రత గురించి మాట్లాడే నాయకులు, తమ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు. ఏఆర్ రెహమాన్ స్టూడియో మినహా మరెక్కడా ఇలాంటి కమిటీలు లేవని ఆమె గుర్తు చేశారు.

17 మంది మహిళలు ఒక వ్యక్తిపై ఆరోపణలు చేస్తే, ఆ వ్యక్తికి మద్దతు తెలపడం మహిళా ఓటర్లందరూ గమనించాల్సిన విషయం అని ఆమె హెచ్చరించారు. తనను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. "తమిళనాడులో వేధింపులకు గురైన మహిళలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. మీరు మీ 'వేటగాళ్లను' కాపాడుకుంటూ ఉండండి. కానీ రేపు మీ పిల్లల దగ్గరకు ఎవరు రావచ్చో, ఎవరు ప్రమాదకరమో మీకు తెలియదు. కాలమే మీకు సరైన పాఠం చెబుతుంది" అని చిన్మయి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ వైరముత్తును ప్రియ మిత్రుడు అని, కమల్ హాసన్ కవి చక్రవర్తి అని పొగడటంపై చిన్మయి వేసిన సెటైర్లు ఇప్పుడు కోలీవుడ్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.

ఇలా మీ ముందుకు వస్తానని అనుకోలేదు.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ

Next Story