తిరుమలలో కేక్ రచ్చ.. దివ్వెల మాధురికి జాన్వీ కపూర్ మాస్ వార్నింగ్!

by Mallepaka Hamsa |

కొందరు తమ తప్పుల నుండి తప్పించుకోవడానికి, ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఏదేదో మాట్లాడుతుంటారు.

తిరుమలలో కేక్ రచ్చ.. దివ్వెల మాధురికి జాన్వీ కపూర్ మాస్ వార్నింగ్!
X

దిశ,సినిమా: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై కేక్ కట్ చేయడం నిషిద్ధం అనే విషయం తెలిసిందే. అయితే, ఇటీవల బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు సందర్భంగా దివ్యెల మాధురి తిరుమలలో కేక్ కట్ చేయించడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై భక్తులు, టీటీడీ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడమే కాకుండా, ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ వివాదంపై స్పందించిన దివ్యెల మాధురి ఒక ఇంటర్వ్యూలో విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చారు. "గతంలో నటి జాన్వీ కపూర్ కూడా తిరుమలలో కేక్ కట్ చేశారు, అప్పుడు ఎవరూ అడగలేదు.. మరి నేను చేస్తేనే ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు?" అంటూ ప్రశ్నించారు. తన తప్పును సమర్థించుకోవడానికి ఏకంగా శ్రీవారి భక్తురాలైన జాన్వీ కపూర్‌ను ఈ గొడవలోకి లాగడం సంచలనంగా మారింది. ఈ విషయం జాన్వీ కపూర్ దృష్టికి వెళ్లడంతో ఆమె చాలా సీరియస్‌గా స్పందించినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ మాధురికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "కొందరు తమ తప్పుల నుండి తప్పించుకోవడానికి, ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఏదేదో మాట్లాడుతుంటారు. స్పష్టంగా చెబుతున్నాను.. నేను తిరుమలలో ఎప్పుడూ కేక్ కట్ చేయలేదు. మన సంస్కృతి, దేవుడి పట్ల ఎప్పుడూ గౌరవం ఉండాలి. మీ సమస్యల కోసం ఇతరులను నిందించడం సరికాదు" అని జాన్వీ స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారికి జాన్వీ కపూర్ పరమ భక్తురాలు. ఆమె తరచుగా కాలినడకన కొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అలాంటిది కేక్ కట్ చేసిందంటే మేము నమ్మం అని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఈ 'కేక్ వార్' సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Next Story