బిగ్‌బాస్ విన్నర్‌కు షాక్.. మూడు నెలలైనా రాని రూ. 50 లక్షల ప్రైజ్ మనీ!

by Mallepaka Hamsa |

నిజం చెప్పాలంటే, విజేతగా ప్రకటించిన వెంటనే డబ్బులు చేతికి రావు. షో ముగిసి నెలలు గడుస్తున్నా నాకు ఇంకా ప్రైజ్ మనీ అందలేదు.

బిగ్‌బాస్ విన్నర్‌కు షాక్.. మూడు నెలలైనా రాని రూ. 50 లక్షల ప్రైజ్ మనీ!
X

దిశ, సినిమా: హిందీ పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 19 విజేతగా నిలిచిన గౌరవ్ ఖన్నా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. షో ముగిసి మూడు నెలలు గడుస్తున్నా, తనకు రావాల్సిన భారీ ప్రైజ్ మనీ ఇంకా అందలేదని ఆయన వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డిసెంబర్ 2025లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా గౌరవ్ ఖన్నా విజేతగా నిలిచారు. ఆ సమయంలో ఆయనకు రూ. 50 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. అయితే, ఇటీవల తన యూట్యూబ్ వ్లాగ్‌లో అభిమానులతో ముచ్చటించిన గౌరవ్.. "నిజం చెప్పాలంటే, విజేతగా ప్రకటించిన వెంటనే డబ్బులు చేతికి రావు. షో ముగిసి నెలలు గడుస్తున్నా నాకు ఇంకా ప్రైజ్ మనీ అందలేదు" అని బాంబు పేల్చారు.

అయితే, షో నిర్వాహకులపై ఆయన ఎటువంటి అసహనం వ్యక్తం చేయలేదు. ఈ ఆలస్యం వెనుక ఉన్న సాంకేతిక కారణాలను ఆయన వివరించారు. "ఒక కంపెనీ నుండి ఇంత పెద్ద మొత్తంలో నగదు రావాలంటే దానికి ఒక సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. ఇంటర్నల్ ఆడిట్స్, పేపర్ వర్క్ వంటి పనులు పూర్తి కావడానికి సమయం పడుతుంది. సాధారణంగా ఇలాంటి షోల విషయంలో 1-2 నెలల ఆలస్యం సహజమే. నేను టీవీ పరిశ్రమలో ఎప్పటి నుండో ఉన్నాను. ఇక్కడ పేమెంట్స్ విషయంలో కొంచెం ఆలస్యం జరగడం సాధారణ విషయం. డబ్బులు రాకుండా పోయే ప్రసక్తి లేదు, కచ్చితంగా అందుతాయని నాకు నమ్మకం ఉంది" అని ఆయన అభిమానులకు భరోసా ఇచ్చారు. ఏది ఏమైనా, దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో విజేతకు ఇంకా బహుమతి సొమ్ము అందలేదనే వార్త ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీస్తోంది.

Next Story