ఊహించని లుక్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. ‘క్యాస్ట్’లో ఆమె ఉగ్రరూపాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |

సాధారణంగా గ్లామర్ పాత్రల్లో కనిపించే దివి, ఈ పోస్టర్‌లో మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.

ఊహించని లుక్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. ‘క్యాస్ట్’లో ఆమె ఉగ్రరూపాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దివి వడ్త్యా, తన నటనతో క్రమంగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఈ బ్యూటీ, తాజాగా తన లేటెస్ట్ మూవీ ‘క్యాస్ట్’ నుంచి విడుదలైన లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కుల వ్యవస్థ నేపథ్యంలో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, దారుణాలను కళ్లకు కట్టే విధంగా ఏకే జంపన్న దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, సత్యం రాజేష్, గగన్, యాంకర్ రవి వంటి వారు హీరోలుగా నటిస్తుండగా, దివి ఒక పవర్‌ఫుల్ హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది. నేడు దివి పుట్టినరోజు కావడంతో, ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సాధారణంగా గ్లామర్ పాత్రల్లో కనిపించే దివి, ఈ పోస్టర్‌లో మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. నుదుట పెద్ద బొట్టు, మెడలో పులి గోర్ల హారంతో, అత్యంత భయంకరమై, పవర్‌ఫుల్ అవతారంలో ఆమె లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఆమె ‘ధూమవతి’ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. "క్యాస్ట్ చిత్రంలో ధూమవతిగా దివి చూపించబోయే ఈ ఉగ్రరూపం ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం గుర్తుండిపోతుంది" అని చిత్ర యూనిట్ పేర్కొనడం విశేషం.

ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రంతో మళ్ళీ ఇండస్ట్రీలో ఒక బలమైన పాత్రతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన స్వామి మాల వేషధారణలో, అత్యంత గంభీరమైన ‘రంగరాజన్’ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సామాజిక అంశాల నేపథ్యంలో వస్తున్న ‘క్యాస్ట్’ చిత్రం, దివి కొత్త లుక్, నాగబాబు వంటి సీనియర్ నటుల భాగస్వామ్యంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గ్లామర్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, ఒక బలమైన పాత్రను ఎంచుకున్న దివి, ఈ సినిమాతో తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తోంది. ఈ ‘ధూమవతి’ అవతారం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉంటుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. మొత్తానికి, విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రంపై సినీ ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Next Story