అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ విడుదల వాయిదా.. కొత్త తేదీపై కీలక ప్రకటన చేసిన నిర్మాత

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-02 09:20:36  IST  )

ప్రస్తుతం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో రెండు సినిమాలకు తగినంత థియేటర్లు, ప్రేక్షకుల ఆదరణ దక్కాలనే ఉద్దేశంతోనే ‘భూత్ బంగ్లా’ను ఒక వారం ముందుకు జరిపాము.

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ విడుదల వాయిదా.. కొత్త తేదీపై కీలక ప్రకటన చేసిన నిర్మాత
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ కామెడీ మూవీ ‘భూత్ బంగ్లా’ విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, ఇప్పుడు ఒక వారం ఆలస్యంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 16న రాత్రి 9 గంటల నుండి పెయిడ్ ప్రివ్యూలతో ప్రారంభమై, ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పంపిణీదారుల, ఎగ్జిబిటర్ల విన్నపం మేరకు, రెండు పెద్ద చిత్రాల మధ్య పోటీ లేకుండా చూసేందుకు ఈ వాయిదా అనివార్యమైందని ఆమె పేర్కొన్నారు. "ప్రస్తుతం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.

ఇలాంటి సమయంలో రెండు సినిమాలకు తగినంత థియేటర్లు, ప్రేక్షకుల ఆదరణ దక్కాలనే ఉద్దేశంతోనే ‘భూత్ బంగ్లా’ను ఒక వారం ముందుకు జరిపాము" అని ఏక్తా కపూర్ వివరించారు. ఈ విషయంపై హీరో అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ట్రెండ్ గురించి తాము ఎప్పుడూ ఆలోచించలేదని స్పష్టం చేశారు. "ప్రస్తుతం యాక్షన్ సినిమాల హవా నడుస్తున్న మాట వాస్తవమే, కానీ మేము కథను నమ్మి ఈ మూవీ చేశాం. ‘ధురంధర్’ ఒక అడల్ట్ చిత్రం అయితే, మా ‘భూత్ బంగ్లా’ పిల్లలు, కుటుంబ సభ్యులు కలిసి చూసే ఒక క్లీన్ ఎంటర్‌టైనర్. ఏ సినిమాకు ఉండే ప్రాధాన్యత దానికి ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో వామీకా గబ్బి, పరేష్ రావల్, టబు, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రియదర్శన్ - అక్షయ్ కుమార్ కాంబోలో గతంలో వచ్చిన క్లాసిక్ సినిమాల తరహాలోనే ఇది కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

యుగానికి ఒక్కడు-2’ నుంచి తప్పుకున్న ఆండ్రియా.. సెల్వరాఘవన్‌తో పని చేయడం కష్టమంటూ షాకింగ్ కామెంట్స్!

Next Story