ఊహలకు తగ్గట్టుగా జీవించలేకపోతున్నా.. అందుకే దూరం అవుతున్నానంటూ ఐశ్వర్య లక్ష్మి ఎమోషనల్ నోట్..

by Mallepaka Hamsa |

కోలీవుడ్ యంగ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) ఇటీవల ‘మామన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అదే ఫామ్‌తో వరుస చిత్రాలు అనౌన్స్ చేస్తోంది.

ఊహలకు తగ్గట్టుగా జీవించలేకపోతున్నా.. అందుకే దూరం అవుతున్నానంటూ ఐశ్వర్య లక్ష్మి ఎమోషనల్ నోట్..
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) ఇటీవల ‘మామన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అదే ఫామ్‌తో వరుస చిత్రాలు అనౌన్స్ చేస్తోంది. ఈ అమ్మడు హిట్ మూవీ సీక్వెల్ ‘గట్ట కుస్తీ-2’ (gatta kusthi-2),సంబరాల ఏటిగట్టు(sambharala yetigattu) సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాకు గుడ్ బై చెప్తూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ‘‘నేను సినిమా ఆటలో ఉండాలంటే సోషల్ మీడియా వాడకం చాలా ముఖ్యమని అనుకున్నాను. కాలానికి అనుగుణంగా మారడం అవసరమని నేను భావించా. ఈక్రమంలోనే ఏదో విధంగా కొన్ని అంశాల్లో సోషల్ మీడియా అనుకూలంగా ఉంటుందనుకున్నా. కానీ అలా జరగలేదు.. దానికి అలవాటు పడేలా చేసింది. అది నా పనిని డిస్టర్బ్ చేయడంతో పాటు నేను చేయాలనుకున్న వాటికి దూరం చేసింది.

నా ఆలోచనలను సోషల్ మీడియా దోచుకుంది. చిన్న చిన్న ఆనందాలను దు:ఖంగా మార్చేసింది. నా బాల్య ఆనందాలన్నింటినీ తొలగించింది. ఒక మహిళగా నేను సోషల్ మీడియా వల్ల వచ్చిన ఇబ్బందులను ఎదుర్కోవడానికి చాలా కష్టపడ్డాను. ఇంటర్నెట్ కోరుకునే ఊహలకు తగ్గట్టుగా జీవించలేకపోతున్నాను. ఈ రోజుల్లో సోషల్ మీడియా లేనివారిని ప్రజలు మర్చిపోతారని నాకు తెలుసు.. అయినప్పటికీ నేను సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక నటిగా నేను సరైన నిర్ణయం తీసుకున్నానని అనుకుంటున్నాను. నాలోని కళాకారిణి, అమాయకత్వం, వాస్తవికతను నిలుపుకోవడానికి నేను ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటున్నాను. నేను సరైన దారిలో వెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను.

నా జీవితంలో మరింత బలమైన బంధాలు ఏర్పడతాయనుకుంటున్నా. ఎక్కువ సినిమాలలో నటించాలని ఆశిస్తున్నా. ఇక నుంచి మంచి చిత్రాలు చేస్తాను.. నన్ను ప్రేమగా గుర్తుంచుకోండి.. మర్చిపోకండి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇటీవల అనుష్క శెట్టి కూడా సోషల్ మీడియాకు దూరం అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐశ్వర్య లక్ష్మి పోస్ట్ పెట్టడంతో హీరోయిన్స్ ఒక్కరొక్కరుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలెంటో అని నెటిజన్లు అయోమయంలో పడిపోయారు.

Next Story