విడుదలకు ముందే రూ.100 కోట్ల డీల్.. మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు!

by Mallepaka Hamsa |

ఈ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఏకంగా రూ. 100 కోట్ల భారీ పెట్టుబడిని పెడుతోంది.

విడుదలకు ముందే రూ.100 కోట్ల డీల్.. మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు!
X

దిశ, సినిమా: భారతీయ చలనచిత్ర రంగంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్‌ను మార్చేసిన ఘనత ఖచ్చితంగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీకే దక్కుతుంది. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబాన్ని ఆపద నుండి కాపాడుకోవడం కోసం, చట్టం కళ్లకు గంతలు కట్టి ఆడే మైండ్ గేమ్ ప్రేక్షకులను అప్పట్లో మంత్రముగ్ధులను చేసింది. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం, ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళం ఇలా అన్ని ప్రధాన భాషల్లోనూ రీమేక్ అయ్యి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ క్రేజీ సిరీస్‌లో మూడో భాగం ‘దృశ్యం-3’ రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్‌గా ‘దృశ్యం-3’ చిత్రానికి సంబంధించి సినీ వర్గాల్లో ఒక సెన్సేషనల్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఏకంగా రూ. 100 కోట్ల భారీ పెట్టుబడిని పెడుతోంది. పనోరమా స్టూడియోస్ ద్వారా ఆశీర్వాద్ సినిమాస్‌లో ఈ భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. సాధారణంగా మలయాళ చిత్ర పరిశ్రమ మార్కెట్ పరిధి మిగతా భాషలతో పోలిస్తే కొంత తక్కువగా ఉంటుంది.

అలాంటిది విడుదలకు ముందే ఒక మలయాళ సినిమాకు వంద కోట్ల రూపాయల పెట్టుబడి రావడం అనేది ఒక చారిత్రాత్మక రికార్డు అని చెప్పాలి. ఈ స్థాయిలో పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణం జార్జ్ కుట్టి పాత్రకు ఉన్న విపరీతమైన పాపులారిటీ. అలాగే దర్శకుడు జీతూ జోసెఫ్ అందించే స్క్రీన్ ప్లేపై ఉన్న నమ్మకం. ‘దృశ్యం’ మొదటి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం వల్ల, మూడో భాగంపై దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. జార్జ్ కుట్టి తన తెలివితేటలతో పోలీసుల నుంచి ఎలా తప్పించుకుంటాడు? ఈసారి ఆయన ఆడే మైండ్ గేమ్ ఏ స్థాయిలో ఉండబోతోంది? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది. ఈ 100 కోట్ల డీల్‌తో ‘దృశ్యం-3’ కేవలం ఒక ప్రాంతీయ సినిమాగా కాకుండా, పాన్-ఇండియా రేంజ్‌లో భారీ విజువల్ వండర్‌గా రాబోతోందని స్పష్టమవుతోంది. ఈ క్రేజీ థ్రిల్లర్ మే 21న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story