కొవిడ్-19 జాగ్రత్తలతో మూవీ పోస్టర్స్

by  |
కొవిడ్-19 జాగ్రత్తలతో మూవీ పోస్టర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ప్రియులకు వారానికో కొత్త సినిమా, లేటెస్ట్ అప్ డేట్స్ లేనిదే నిద్ర పట్టదు. కానీ కరోనా ఎఫెక్ట్‌తో వారికి కూడా కష్టాలు తప్పలేదు. సినిమా షూటింగ్‌లు వాయిదా పడడమే కాదు… ఉన్న సినిమాలు చూద్దామనుకున్నా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో టెలివిజన్, సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ ద్వారా కాస్త ఉపశమనం పొందుతున్నారు. అయితే శ్రీరామ నవమి సందర్భంగా త్వరలో విడుదల కానున్న సినిమాలు అప్ డేట్స్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. మూవీ యూనిట్స్ కూడా పండుగ శుభాకాంక్షలు మాత్రమే తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేయడం కాదు… లాక్ డౌన్ సమయంలో ఎలా ఉండాలనే సూచనలిస్తూ పోస్టర్లు విడుదల చేయడం ప్రత్యేకత సంతరించుకుంది.

మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ‘క్రాక్’. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా… యదార్థ కథల ఆధారంగా సినిమా రూపొందిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ కాగా… వరలక్ష్మీ శరత్ కుమార్ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ కాగా… ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనే మెస్సేజ్ ఇచ్చింది మూవీ యూనిట్. ఈ పోస్టర్‌లో రవితేజ తన భార్య, కొడుకును ఎత్తుకుని ఫ్యామిలీ టైంను ఎంజాయ్ చేయడం కనిపిస్తుంది. కాగా రవితేజకు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. లేదంటే కెరియర్‌లో చాలా కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ‘రాజా ది గ్రేట్’ తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ కాగా… కనీసం ఈ మూవీ అయినా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న సినిమాకు దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నాడు. చిత్రం నుంచి వచ్చిన రెండు పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ కాగా… శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌లో హీరో తన ఫ్రెండ్‌తో కలిసి బైక్ మీద వస్తుండగా… హీరోయిన్ ముఖానికి చున్నీతో కప్పుకుని ఉంది. తద్వారా కరోనా ఎఫెక్ట్ టైంలో మాస్క్ లేక ఖర్చీఫ్ కట్టుకుని ఉండడం మంచిదనే సందేశాన్నిచ్చింది ‘ఉప్పెన’ టీం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘శ్రీకారం’ మూవీ యూనిట్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. కరోనా విపత్కర పరిస్థితులను ఉద్దేశిస్తూ… ‘ ఓ రాములయ్య మీరు చూడని కష్టం లేదు… మీ అడుగుల్లో నడిచే మాకిదేమీ కష్టం కాదు ‘ అనే మెస్సేజ్‌తో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. కిశోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్‌పై రూపుదిద్దుకుంటోంది. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తుండగా… సాయి మాధవ్ బుర్రా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

సత్యదేవ్ హీరోగా వస్తున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ టీం శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. కరోనా ప్రభావం చూపుతోందని… ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.

Tags : Movie Posters, Sri Rama Navami, CoronaVirus, Covid 19

Next Story