పాపం.. కన్న తల్లిపై కనికరం చూపని కసాయి కొడుకులు.. నడిరోడ్డుపైనే..!

by  |
పాపం.. కన్న తల్లిపై కనికరం చూపని కసాయి కొడుకులు.. నడిరోడ్డుపైనే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : నేటి సమాజంలో బంధాలు, బంధుత్వాలు, విలువలకు కాలం చెల్లిపోయినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు, చోటుచేసుకుంటున్న ఘటనలు, దృశ్యాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఆస్తి కోసం అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లు అనే తేడా లేకుండా గొడవలకు పోవడం, చంపుకోవడం, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయడం లేదా ఒంటిరిని చేసి వెళ్లిపోవడం వంటి హృదయవిదారక దృశ్యాలు ప్రస్తుత సమాజంలో చాలానే వెలుగుచూశాయి. వృద్ద్యాప్యంలో తల్లిదండ్రులకు నాలుగు మెతుకులు పెట్టేందుకు పిల్లలకు మనసు రావడం లేదు. తిండి పెట్టడానికి వంతులు పెట్టుకుంటున్నారు. లేదంటే పేరెంట్స్‌ను ఇంట్లోంచి గెంటేసి మానవత్వాన్ని మంటగలుపుతున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని ప్రకాశం జిల్లా కంభంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ముగ్గురు కొడుకులున్న ఓ తల్లి ఒంటరైంది. ఇంట్లోకి రానివ్వకుండా ముగ్గురు తనయులు గెంటివేశారు. ఒక్కొక్కరు మూడు నెలల చొప్పున కన్న తల్లిని చూసుకోవాలని పెద్దలు పంచాయితీ చెప్పగా.. మూడు నెలలు కాకముందే తల్లిని తన ఇంట్లో వదిలేశారని ఓ కొడుకు గొడవకు దిగాడు. దీంతో సోదరుడి ఇంట్లో తల్లిని దింపడానికి వచ్చిన మరో కొడుకు నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ వృద్ధురాలు కంటతడి పెడుతూ అక్కడే నిలబడిపోయింది. తనను తీసుకెళ్లడానికి ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూడ సాగింది. ఈ హృదయ విదారక దృశ్యం స్థానికులను కూడా అయ్యో పాపం అనేలా చేశాయి.



Next Story