తెలుగింటి అందమైన వేదిక పాడ్‌కాస్ట్స్.. 

by  |
telugu podcast
X

దిశ, ఫీచర్స్ : మనసులోని భావాలను, మనవైన అనుభవాలను, మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవడానికి అందమైన వేదిక ‘పాడ్‌కాస్ట్’. చిట్టిపొట్టి కథల నుంచి ఆకాశవీధుల్లోని ఆంతర్యాల వరకు దేన్నయినా ఈ వేదికగా పంచుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచమంతటా ‘పాడ్‌కాస్ట్’ల హవా నడుస్తుండగా, ఇటీవల కాలంలో తెలుగునాట కూడా వీటికి ఆదరణ లభిస్తోంది. ఇంగ్లిష్ ఆధిపత్యంతో పాటు ఇతర విదేశీ భాషల ప్రాధాన్యత, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న ప్రస్తుత తరుణంలో అన్ని ప్లాట్‌ఫామ్‌లపై ప్రాంతీయ భాషల కంటెంట్ క్రమంగా పెరుగుతోంది. మన భాషలోని మాధుర్యాన్ని, సంస్కృతి ఔన్నత్యాన్ని, భారతదేశ వైవిధ్యాన్ని చాటడానికి ‘పాడ్‌కాస్ట్’ ఓ చక్కని వేదిక. అంతేకాదు ఎంచుకున్న అంశాన్ని సుత్తి లేకుండా, క్లియర్ కట్‌గా చెప్తుండటంతో శ్రోతలు పాడ్‌కాస్ట్‌లను అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆకర్షణీయమైన కంటెంట్‌, ఆహ్లాదకరమైన వాయిస్‌తో తెలుగు ప్రజలను ఆకట్టుకుంటున్న మన పాడ్‌కాస్ట్‌ల గురించి స్పెషల్ స్టోరీ..

డాబా కథలు

ఈ పేరు వింటుంటూనే.. వేసవి రాత్రుల్లో డాబా మీద పడుకొని, చుక్కలను చూస్తూ, బంధుమిత్రులతో కలిసి పంచుకున్న జ్ఞాపకాల దొంతర మనసులో మెదులుతుంది కదూ! అచ్చంగా ఈ పాడ్‌కాస్ట్‌ ఉద్దేశం కూడా అదే. 90 తరానికి(జనరేషన్ 90) చెందిన వారి అనుభవాలను మరోసారి మనముందుంచుతున్న ఈ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించింది అవినాశ్ మంచిరాజు. ‘మిలినీయల్స్’.. తాము ప్రేమించిన, ఆనందించిన, పిల్లలుగా ఎంతో సంతోషించిన చిన్న చిన్న ఆనందాలను పంచుకుంటూ, ఓ చక్కని కథనాన్ని అందిస్తూ శ్రోతల మనసు దోచుకుంటున్నాడు అవినాశ్. స్లామ్‌బుక్, జెటిక్స్, పంచతంత్రం, అయ్యంగార్ బేకరీ, మెగా‌స్టార్ అభిమాని వంటి ఎపిసోడ్‌లలో స్వచ్ఛమైన నోస్టాల్జియాను తీసుకురావడంలో అతను విజయవంతమయ్యాడు. ఒక్కసారి డాబా కథల్లోకి తొంగిచూస్తే.. మరోసారి 90ల్లోకి వెళ్లడం ఖాయం. ఆ గురుతులను తలచుకుంటుంటే, అప్రయత్నంగానే మన మోముపై నవ్వులు పలకరిస్తాయి, ఏవో ఊసులు చక్కలిగింతలు పెడతాయి.

పరుశురాం శ్రీనివాస్

తెలుగు ఫిల్మ్ డైలాగ్ రైటర్ పరుశురాం శ్రీనివాస్‌.. సినిమాల్లోనే కాకుండా తన పాడ్‌కాస్ట్ ద్వారా అద్భుతమైన డైలాగ్స్ అందిస్తూ, తెలుగు శ్రోతలను ఆకట్టుకుంటున్నాడు. ‘ఏ దేశంలోనైనా జ్ఞానం కోసం చదువుతారు. కానీ మనదేశంలో మాత్రం ప్రెస్టీజ్ కోసం చదువుతారు. ఇండియాలో మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్‌కు పిల్లలు కనే కలలు తెలీదు. తెలిసినా అర్థం కావు. ఎందుకంటే ప్యాషన్‌ను కూడా హ్యాబీలాగా మార్చుకోమనే సలహాలు మనదేశంలోనే వింటాం, ఏ కొత్త విషయానికైనా కొన్ని రోజులు మాత్రమే ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జైట్‌మెంట్ కాస్త అడ్జస్ట్‌‌మెంట్ అయిపోతుంది’ అంటూ ఆయన గళంలో వినిపించే పదునైన మాటలు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. ‘హేళన చేయకు బ్రో, టాపర్ సాలే, బి సెల్ఫిష్, నీ ప్రేమ (నీ కర్మ), మొహబ్బత్, ఫ్రెండ్‌షిప్, చెబితే వినాలి’ వంటి ఎపిసోడ్స్ ఆడియెన్స్‌లో బజ్ క్రియేట్ చేశాయి.

సంవేద్ సాగాస్

ఈ పాడ్‌కాస్ట్ ప్రధానంగా ‘మోటివేషన్, ట్రావెలింగ్, నేచర్, లైఫ్ అండ్, ఎంట్రప్రెన్యూర్‌షిప్’ వంటి అంశాల మీద సాగుతుంది. ఎంతోమంది ప్రజల ప్రయాణ అనుభవాలతో చేసిన ఈ సిరీస్ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. నటుడు, రచయిత. దర్శకుడు తనికెళ్ల భరణితో చేసిన ఇంటర్వ్యూ ది బెస్ట్‌గా నిలిచింది. ‘వై పీపుల్ హేట్ ఆర్జీవీ’, ‘మంగమ్మ చెప్పిన కథ’, మాస్క్ మాట్లాడితే’ ‘ఆన్సియెంట్ హ్యాబిట్స్’ ఎపిసోడ్స్ విశేష ఆదరణ చూరగొన్నాయి.

హరీష్ శంకర్

దర్శకుడిగా హరీష్ శంకర్ సక్సెస్ సాధిస్తున్నా.. తనలోని రచయితకే ఎక్కువ మార్కులు పడతాయనడంలో సందేహం లేదు. హీరో బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ డైలాగ్‌లతో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే హరీష్ .. బలమైన భావనను సైతం సింగిల్ లైన్‌లోనే చెప్పేయగలడు. ఇక సినిమా వేడుకల్లో వేదిక ఎక్కితే, ఆ మాటల ప్రవాహం మరో రేంజ్‌లో ఉంటుంది. ఈ విధంగా పదాలు, ప్రాసలతో స్పీచ్ ఇవ్వడంలో త్రివిక్రమ్‌ది ఒక పంథా అయితే, హరీష్‌ది మరో పంథా. ఇక తన పాడ్‌కాస్ట్ ‘సౌండ్స్ గుడ్’లోనూ ఆలోచింపజేసే మాటలతో పాటు తన జీవితానుభావాలను శ్రోతలతో పంచుకుంటూ వారి హృదయాలు దోచుకుంటున్నాడు. ‘అందరం సోనూసూద్‌లు అవ్వలేం’, ‘పటాన్ చెరువు టు దిల్‌సుఖ్ నగర్’, ‘మాస్ మహరాజ్’, ‘బొమ్మ పడింది’ ‘ఉందిలే మంచి కాలం’ తదితర ఎపిసోడ్స్‌తో సీజన్1లో ఇప్పటివరకు 15 ఎపిసోడ్స్ అందించాడు.

పూరి జగన్నాథ్

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాటల తూటాలు ఎలా పేలుస్తారో చెప్పాల్సిన పనిలేదు. తెరమీద పేల్చే డైలాగ్‌లే కాదు.. ‘పూరి మ్యూజింగ్స్’ ద్వారా తను వినిపిస్తున్న జీవిత సత్యాలు కూడా తనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అంతేకాదు తన పాడ్‌కాస్ట్‌ను ‘స్పాటిఫై ఇండియా చార్ట్‌’లో అగ్రస్థానంలో నిలిపాయి. సినిమాలో అన్ని విషయాలను చెప్పలేం. సీన్‌కు తగ్గట్టే మాటలు రాయాలి. అందుకే తను చెప్పాలనుకున్న ఎన్నో విషయాలను పాడ్‌కాస్ట్ ద్వారా వివరించాడు పూరి. ఫిలాసఫీ, ఫుడ్, నేచర్, కల్చర్, ట్రెడిషన్, ఇండియా, హిస్టరీ, వరల్డ్, టెక్నాలజీ, లవ్, ఫ్రెండ్‌షిష్, మనీ, రిలేషన్స్.. వాట్ నాట్ అన్నట్లు ఎన్నో టాపిక్స్‌పై చాలా సింపుల్‌గా చురకలంటిస్తూ పూరి చెప్పిన విధానం పాడ్‌కాస్ట్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇవే కాదు.. రాగ‌పాడ్ – ‘తెలుగు అమ్మాయి పాడ్‌కాస్ట్, కథ చెప్పవా అమ్మమ్మ, నమస్తే తెలుగు, దాసు తాతయ్య కథలు’ ఇలా మరికొన్ని పాడ్‌కాస్ట్‌లు తెలుగు శ్రోతలతో తమ భావాలను పంచుకుంటున్నారు. చాలామందికి తమ అభిప్రాయాలను, జ్ఞానాన్ని పదిమందితో పంచుకోవాలని ఉంటుంది కానీ, కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడతారు లేదంటే భయపడతారు. అలాంటి వారికి ‘పాడ్‌కాస్ట్’ సూపర్ ప్లాట్‌ఫామ్ కావడంతో ఇప్పడిప్పుడే మన తెలుగులోనూ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తులో ‘పాడ్‌కాస్ట్’లు మరింత పాపులారిటీని సాధిస్తాయని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.


Next Story

Most Viewed