కిడ్నాప్ కేసులో మరిన్ని ట్విస్టులు

by  |
కిడ్నాప్ కేసులో మరిన్ని ట్విస్టులు
X

దిశ, క్రైమ్ బ్యూరో : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో రోజురోజుకు అనేక మలుపులు, ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కిడ్నాప్‌‌ను 10 మంది బృందం చేశారని పోలీసులు ముందుగా భావించారు. కాగా దర్యాప్తులో భాగంగా తవ్వుతున్న కొద్దీ.. ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్టుగా భావిస్తున్న వారి జాబితా కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఈ క్రమంలో కిడ్నాప్ కేసులో నిందితుల సంఖ్య 19 మందికి చేరగా… తాజాగా 23కు చేరుకుంది. సీసీ ఫుటేజ్, కాల్ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానంతో మొదటి నుంచి ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. కిడ్నాప్ సమయంలో వచ్చిన డయల్ 100 ఫోన్‌కాల్‌ను కూడా పోలీసులు అంతే కీలకంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోయిన్ పల్లి లోని బాధితుల నివాసానికి సమీపంలోని పలువురితో మాట్లాడిన పోలీసులు, సుమారు 50 మందికి పైగా అనుమానితులను అదుపులోకి వేర్వేరు ప్రాంతాల్లో విచారించినట్టుగా విశ్వసనీయ సమాచారం.

హెల్ప్ మీ.. హెల్ప్ మీ అరుపులతో..
హఫీజ్‌పేట్ ల్యాండ్ వివాదం నేపథ్యంలో ఈ నెల 5న బోయిన్‌పల్లి లోని ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావు నివాసానికి ఐటీ అధికారుల పేరుతో చేరిన బృందం.. అనంతరం ఆ ముగ్గురి సోదరులను కిడ్నాప్ చేశారు. ఆ రోజు సాయంత్రం 7.20 గంటల తర్వాత ముఖాలకు మాస్క్‌లు వేసి వాహనాలలో తీసుకెళ్తున్న క్రమంలో బాధితులు హెల్ప్ మీ.. హెల్ప్ మీ అంటూ అరిచినట్టుగా తెలుస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే బాధితుల నివాసానికి సమీపంలోని రహదారిపై ఈ కేకలను విన్న కొందరు యువకులు వెంటనే పోలీస్ టోల్ ఫ్రీ నెంబరు 100 కు ఫోన్‌కాల్ చేసి సమాచారం ఇచ్చారు.

డయల్ 100 యూనిట్ నుంచి హైదరాబాద్ సీపీ, నార్త్ జోన్ డీసీపీ సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆ వెంటనే సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించే పనిలో పడ్డారు. ఫుటేజ్‌లో ఆ వాహనాలు కన్పించడంతో లింక్ బేస్‌తో పోలీసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా, తమకున్న పరిచయాలతో బాధితుల సోదరుడు ప్రతాప్ రావు రాజకీయ నేతలకు సమాచారం ఇవ్వడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మాలోతు కవితలు పోలీసుల కంటే ముందుగానే చేరుకున్నారు.

అనంతరం బాధితుల ఇంటికి చేరుకున్న పోలీసు అధికారులతో హఫీజ్‌పేట ల్యాండ్ వివాదంలో అఖిల ప్రియతో విభేదాలు ఉన్నాయనే విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ కేసును వెంటనే హై ఫ్రొఫైల్ కేసుగా పరిగణించిన పోలీసులు రాత్రికి రాత్రే అఖిల ప్రియ ఇంటికి నేరుగా వెళ్లి, బాధితులను వదిలిపెట్టకుండా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందంటూ హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫోన్ చేసిన అఖిల ప్రియ బాధితులను వదిలిపెట్టాలని కిడ్నాపర్లకు సూచించినట్టు సమాచారం.

భార్గవ్ తల్లిదండ్రులు కూడా..
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో రోజులు గడుస్తున్నా కొద్దీ.. అనేక సంచలనాత్మకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డయల్ 100 కాల్ తో మొదలైన కిడ్నాప్ కేసు అనేక ట్విస్టులను సంతరించుకుంటోంది. కేసు దర్యాప్తులో భాగంగా డయల్ 100 కు కాల్ చేసిన వారి నుంచి కూడా పోలీసులు కొంత సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా, బాధితుల నివాసానికి సమీపంలో ఉన్న హోటల్ సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో వీరిని ప్రధాన ఐ విట్ నెస్ లుగా పరిగణిస్తూ.. వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇదిలా ఉండగా, పోలీసులు దర్యాప్తులో వెలుగు చూసిన అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని దాదాపు 50 మంది అనుమానితులను నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో విచారించినట్టుగా సమాచారం.

అనేక కోణాలలో సరైన ఆధారాలతో లభించిన తర్వాతే భార్గవ్ సోదరుడు చంద్రహాస్, అఖిల సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి లను ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్టుగా సమాచారం. చంద్రహాస్ రెక్కీలో భాగస్వామి కాగా, డ్రైవర్ వాగ్మూలంతో జగత్ విఖ్యాత్ పాత్రను నిర్థారించారు. ఇదిలా ఉండగా, యూసుఫ్ గూడ ఎంజీఎం స్కూల్లో కిడ్నాపర్లు ఉన్న టైంలో భార్గవ్ తల్లిదండ్రులు శ్రీరాం నాయుడు, కిరణ్మయి వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌లు లభ్యమయ్యాయి. దీంతో మొత్తంగా ఈ కేసులో నిందితుల సంఖ్య ఒక్కసారిగా 19 నుంచి 23కు చేరినట్లయ్యింది. ఈ కేసులో ఇప్పటి వరకూ ఏ1 అఖిల ప్రియతో పాటు మరో ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారు. గోవా నుంచి తీసుకొచ్చిన నలుగురితో పాటు మరో 11 మంది పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం.

ఏ2 ఏవీ సుబ్బారెడ్డిని తప్పించినట్టేనా..?
ఈ కేసులో ముందుగా ఏ1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి, ఆ తర్వాత ఏ2 గా మారిన సంగతి తెల్సిందే. ఏవీ సుబ్బారెడ్డిని ఏ1 నుంచి ఏ2గా ఎందుకు మార్చారని ప్రశ్నించిన మీడియాకు ఎవిడెన్స్ ఆధారంగానే కేసులో నిందితుల వరుస క్రమం ఉంటుందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 19 మందిని గుర్తించినట్టుగా సీపీ అంజనీకుమార్ ఈ నెల 11న తెలిపారు. ఆ తర్వాత సంక్రాంతి పండుగ గురువారం రోజు ఒక్కసారిగా భార్గవ్ తల్లిదండ్రులు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఈ కేసు అంతా కూడా భామా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ కుటుంబాల చుట్టు తిరుగుతున్న నేపథ్యంలో ఏ2గా పోలీసులు ప్రకటించిన ఏవీ సుబ్బారెడ్డి ఈ కేసు నుంచి తప్పించుకున్నట్టేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకవేళ అదే నిజమైతే, పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా.. లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ కేసులో సెల్ ఫోన్ సిమ్ కార్డుల వినియోగం, సెల్ టవర్ లొకేషన్, సీసీ టీవీ ఫుటేజ్ సీన్స్ తదితర అంశాలన్నీ అఖిల ప్రియ, భార్గవ్ చుట్టూనే తిరుగుతున్నాయి. అంతే కాకుండా, ఈ కేసుతో ఏవీ సుబ్బారెడ్డికి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించిన దాఖలాలు కన్పించడం లేదు. దీంతో దాదాపుగా ఏవీ సుబ్బారెడ్డికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేనట్టుగా పోలీసుల విచారణ స్పష్టం అవుతోంది. కానీ, ఇంకా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున ఎలాంటి పరిణామాలు దారితీస్తాయో చూడాల్సి ఉంది.



Next Story

Most Viewed