‘కాయ్ రాజా కాయ్’.. హుజురాబాద్‌లో ఐదుకు పది..10కి 20.. అతడే విన్నర్.?

by  |
‘కాయ్ రాజా కాయ్’.. హుజురాబాద్‌లో ఐదుకు పది..10కి 20.. అతడే విన్నర్.?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్‌లో ఈటలనే గెలుస్తాడు.. కాదురా బై.. గెల్లు శ్రీనే గెలుస్తాడు. బీజేపీనే గెలుస్తుంది, చల్.. టీఆర్ఎసే గెలుస్తది. ఈటలకు ఇంత మెజార్టీ వస్తుందని ఒకరు, లేదు టీఆర్ఎస్‌కే భారీ మెజార్టీ వస్తుందని మరొకరు. ఇలా ప్రతీ విషయంపైనా బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికలు బెట్టింగ్‌లకు వేదికగా మారింది. ఐదు నెలలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న ప్రచారంలో చివరికి గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ.. బెట్టింగ్ రాజాలు మాత్రం ఫుల్ బిజీ అయిపోయారు. మరో 13 రోజుల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనున్న తరుణంలో రంగంలోకి దిగిన బుకీలు బెట్టింగ్‌లకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ బెట్టింగ్‌ల తంతు హుజురాబాద్ ఎన్నికల తంతును మించిపోతోందన్న ప్రచారం సాగుతోంది.

గెలిస్తే అంత.. ఓడితే ఇంతే..

బెట్టింగ్ వాలాలు విసురుతున్న వలలో చాలా మందే చిక్కుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ వేసే వ్యక్తి చెప్పినట్టుగా ఆ అభ్యర్థే గెలిస్తే అతను పెట్టిన బెట్టింగ్‌కు ఐదు రెట్లు ఇస్తామని బూకీలు చెబుతున్నారు. కానీ, ఓడిపోతే మాత్రం బెట్టింగ్‌లో పాల్గొన్న వ్యక్తి ఇచ్చిన డబ్బులు నిర్వాహకులే తీసుకుంటారు. కొంత మంది అయితే 10 రెట్లు కూడా ఇచ్చేందుకు వెనకాడకుండా ఛాలెంజ్ చేసుకుంటున్నారు. చివరకు గెలిచే అభ్యర్థుల మెజార్టీపై కూడా బెట్టింగ్‌లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ ఎలక్షన్‌లో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉన్న కారణంగా.. కమలం, కారు మధ్యే ఎక్కువగా బెట్టింగ్ జోరు సాగుతున్నట్టు సమాచారం. రూ. 10 వేల నుండి రూ. 10 లక్షల వరకూ బెట్టింగ్ దందా సాగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న బెట్టింగ్‌లు తారస్థాయికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బెట్టింగ్ దందాలో మునిగి తేలుతున్నట్టు సమాచారం. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ బెట్టింగ్‌ల తీరు మారిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.


Next Story