కూర్చోవడానికి కుర్చీ లేదంటూ మండలిలో కవిత ఆవేదన..

1070

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులకు కనీసం కూర్చోడానికి కూడా కుర్చీ లేదని, పంచాయతీరాజ్ మంత్రి చొరవ తీసుకుని దీనికి పరిష్కారం చూపాలని అన్నారు. సమావేశాల్లో భాగంగా సోమవారం మండలిలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా మండలాలు ఏర్పాటైనా ఎంపీపీలకు తగిన ఆఫీసులు లేవని, రోజువారీ అధికారిక విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

సర్పంచ్‌లతో పాటు ఎన్నికైన ఎంపీటీసీలకు కూడా గ్రామ పంచాయతీలలో కనీసం కూర్చోడానికి కుర్చీ లేదని, వారి విధి నిర్వహణకు సమస్యలు ఎదురుకావడంతో పాటు స్థాయికి తగిన కనీస గౌరవం కూడా లభించడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు నిధుల్లో సుమారు రూ. 500 కోట్లు కోత పెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని దాన్ని రాష్ట్ర ఖజానా నుంచి భర్తీ చేస్తున్నారని, కానీ ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయన్నారు. ఎంపీటీసీలకు పంచాయతీ కార్యాలయాల్లో కుర్చీలు కూడా లేకపోవడం బాధాకరమని, మంత్రి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపాలని ప్రోటెమ్ చైర్మన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..