రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. అవన్నీ బంద్

by  |
రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. అవన్నీ బంద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల కోటా కింద ఐదు జిల్లాల పరిధిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనున్నది. మొత్తం 37 కేంద్రాల్లో 5,326 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. రాష్ట్రంలో మొతం పన్నెండు స్థానాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ కాగా.. నాలుగు జిల్లాల పరిధిలో ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగిలిన ఆరు స్థానాలకు మాత్రమే ఇప్పుడు పోలింగ్ అనివార్యమైంది. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆదేశాలతో పాటు కొన్న సూచనలు చేశారు.

పోలీసు భద్రతతో పాటు పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చేయాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. కొవిడ్ నిబంధనలు అమలులో ఉండడంతో పాటు తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల్లో అదనంగా గమనంలోకి తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు నొక్కిచెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదని, కానీ ఎన్నికల సిబ్బంది మాత్రం వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లను ముద్రించామని, వాటికి అవసరమైన బ్యాలెట్ బాక్సులను సైతం సమకూర్చుకున్నామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణను అందించామని, పోలింగ్ కేంద్రాల్లో తగిన వసతులను కూడా కల్పించామన్నారు. పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని బుధవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఈ ఐదు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులను మూసివేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed