ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

by  |
Gutha
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆరింటికి ఆరుస్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటికీ వారిని ప్రతిపాదించేవారు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అధికార పార్టీ అభ్యర్థులు ఆరుగురు ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ధృవీకరణ ప్రతాలను అందజేశారు.

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 16న అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇతర పార్టీలకు గెలిచే అవకాశం లేకపోవడంతో నామినేషన్లు వేయలేదు. కానీ శ్రమజీవి పార్టీ నుంచి భాస్కర్, కోయల్కర్ నామినేషన్లు వేశారు. మొత్తం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ఆరు నామినేషన్లూ అధికార పార్టీకి చెందినవే. అయితే పరిశీలనలోనే శ్రమజీవి పార్టీకి చెందిన ఇద్దరి నామినేషన్లను బలపరిచే సభ్యులు లేకపోవడంతో ఎన్నికల అధికారి తిరస్కరించారు.

ఇదిలా ఉండగా మంగళవారం ఉపసంహరణకు గడువు కావడం అన్ని అధికార పార్టీకి చెందిన నామినేషన్లు ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. కడియం శ్రీహరి, గుత్తాసుఖేందర్ రెడ్డి, కౌశిక్‌రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎంపీ బండ ప్రకాశ్ కు అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ధృవీకరణ పత్రాలను అందజేశారు.

చిత్తశుద్ధితో పనిచేస్తాం : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధి పని చేస్తామని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాలు అందుకున్న తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రామి రెడ్డి, కౌశిక్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆరు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవమయ్యాయన్నారు. అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌‌కు ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో తెలంగాణ ముందుందన్నారు. టీఆర్ఎస్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక బీజేపీ కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. మోడీ, బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లని, ఈ ఏడేళ్లలో దేశ జీడీపీ భారీగా తగ్గిందన్నారు. కరోనా సమయంలో మైనస్‌కు జీడీపీ వెళ్లిందని, నరేంద్ర మోడీ గొప్ప పరిపాలనధక్షుడు అయితే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ధాన్యం సేకరణ అనేది కేంద్రం పరిధి అని, కానీ కేంద్రం కొనటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్న ఘనత కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ దక్షతకు నిదర్శనం అన్నారు.


Next Story

Most Viewed