ఆ పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవు.. మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
Ministers Jagadish Reddy, Niranjan Reddy
X

దిశ, నకిరేకల్: తెలంగాణలో వ్యవసాయ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని, ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని శాలిగౌరారం మండల కేంద్రంలో రైతు వేదిక, రైతు గోడౌన్‌లను రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పుడు వెటకారం చేసిన వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారో ఒక్కసారి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఇష్టానుసారం, అహంకారపూరితంగా మాట్లాడితే, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed