మాస్కు ఏది మంత్రి గారూ….

by  |
మాస్కు ఏది మంత్రి గారూ….
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: సమాజంలో నేడు ప్రతిఒక్కరూ కోవిడ్ నివారణ చర్యలు తీసుకుంటున్న సమయంలో కొంతమంది మాత్రం వాటిని పటించుకోకుండా పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఇది ఎవరో దారిన పోయే దానయ్య చేస్తే సరేలే ఏదో తెలియక చేసి ఉండొచ్చని అనుకోవచ్చు. కానీ పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన రాష్ట్ర మంత్రే ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని చెప్పాలి.

ఆదివారం వనపర్తి జిల్లా సరళాసాగర్ ప్రాజెక్టులో చేపలు వదిలే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలావెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని ఎక్కడ కూడా మస్కు ధరించలేదు. పదుల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఉన్న చోట కూడా ఆయన కనీస నిబంధనలు పాటించకపోవడం ఆందోళనకు దారి తీస్తోంది. అలాగే పలుచోట్ల స్థానిక ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర్ రెడ్డి సైతం మస్కు లేకుండా దర్శనం ఇవడం గమనార్హం. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన నాయకులే ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్‌జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ… విలయతాండవం చేస్తోంది. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 20వేలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సూచనలు చేయాల్సిన మంత్రులు ఇలా వ్యవహరించడం దారుణం అని పలువురు అంటున్నారు. అయితే దీనిపై పలువురు యువకులు, సామాజిక వేత్తలు స్పందిస్తూ, మాస్కు ఏది మంత్రి గారు అంటూ విమర్శలు చేస్తున్నారు.


Next Story

Most Viewed