సిరిసిల్ల కేడర్‌తో కేటీఆర్ రహస్య మంతనాలు.. అందుకేనా?

198

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హలో మీతో కేటీఆర్ గారు మాట్లాడుతారు ఫలనా రోజున హైదరాబాద్ రండంటూ గత వారం రోజులుగా సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలకు కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది నాయకులు హైదరాబాద్ వెళ్లి కేసీఆర్‌తో సమావేశమై రాగా, మిగతా మండలాల వారికి కూడా అపాయింట్ మెంట్ డేట్స్ గురించి సమాచారం వెళ్లింది. ఒక్కొక్కరికి ఫోన్లు చేసి మరీ కేటీఆర్ వ్యక్తిగత బృందం సమాచారం ఇస్తుండటంతో ఈ విషయం ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలో హాట్ టాపిక్ మారింది.

కారణాలివేనా..?

ఆరేళ్ల కాలంలో తమను వివక్షకు గురి చేశారన్న మనో వేదన కొందరిదైతే, సీనియర్లు, జూనియర్లు అంటు వేర్వేరుగా జట్టు కట్టడంతో మరికొందరు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నాయకులకు కేటీఆర్ వద్ద సముచిత ప్రాధాన్యత కల్పించడం లేదని బాధ పడుతున్న వారూ లేకపోలేదు. సిరిసిల్ల మునిసిపాలిటీలో ఏడు గ్రామాలను విలీనం చేశారు. ఈ ఏడు గ్రామాలకు చెందిన ప్రతినిధులకు బల్దియాలో ప్రాధాన్యం లేకుండా పోయింది. నిధుల కేటాయింపు విషయంలో కూడా వివక్ష జరుగుతోందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో విలీన గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. మరో వైపున నిధులు లేక తమ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని స్థానిక సంస్థల ప్రతినిధులు నిరాశకు లోనవుతున్నారు. ఇక్కడి నాయకులు ఏం చెప్పాలన్న కేటీఆర్‌కు సన్నిహితంగా ఉన్న ఒకరిద్దరు నాయకులను కలవాల్సిందే తప్ప నేరుగా ఆయన్ను కలిసే అవకాశం లేకపోవడం వల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారని నిఘా వర్గాలు కేటీఆర్ దృష్టికి తెచ్చాయి.

కమలం ఎఫెక్ట్..?

వివిధ కారణాలతో నిరాశ నిస్పృహలకు గురైన సిరిసిల్ల సెకండ్ కేడర్ చూపు కమలం వైపు పడుతోందని కూడా ఇంటలిజెన్స్ అధికారులు కేటీఆర్‌కు సమాచారం అందించారు. సిరిసిల్ల బల్దియాలో విలీనమైన గ్రామాలతో పాటు తంగళ్ళపల్లి, గంభీరావుపేటతో సహా పలు మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరాలని సమాలోచనలు జరుపుతున్నారని కూడా నిఘా వర్గాలు పంపిన నివేదికలో వివరించినట్లు సమాచారం. అంతేకాకుండా నియోజకవర్గంలోని కొంతమంది సోషల్ మీడియా వేదికగా పార్టీ మారాలన్న ఆలోచనను షేర్ చేసుకున్నట్టు కూడా కేటీఆర్ వరకు చేరడంతో ప్రత్యేకంగా ఆయనే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. రోజు వారిగా పార్టీ సెకండ్ కేడర్‌ను పిలిపించుకుని వారితో కలిసి లంచ్ చేస్తున్న కేటీఆర్ పర్సనల్‌గా మాట్లాడుతున్నారని సమాచారం. దీంతో నిరాశలో ఉన్న వారంతా సంతృప్తి పొందుతున్నారని అంతా భావిస్తున్నారు.