కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ ఫైర్

by  |
కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బేగంపేటలో నిర్వహించిన సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశంలో పారిశ్రామిక వేత్తలతో పాటు మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఒక నవజాత శిశువు వంటిదని, నూతన రాష్ట్రం తన కాళ్ల మీద తాను నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి అన్ని రకాల సాయం అందించాల్సిన బాధ్యతను కేంద్రం ఆది నుంచి విస్మరించిందని నిప్పులు చెరిగారు.

రాష్ట్రం ఏర్పడ్డ ఏడేళ్లలోనే తెలంగాణ వ్యవసాయం నుంచి ఐటీ వరకు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి కనబర్చిందని, జీఏస్ డీపీ పెరుగుదలలో దేశంలోనే మేటిగా ఉందని, కానీ పనిచేసే రాష్ట్రాలను ప్రోత్సాహించడంలో కేంద్రం విఫలమైందన్నారు. అన్ని రంగాల్లో పెర్ఫామింగ్ స్టేట్ గా ఉన్న తెలంగాణాకు కేంద్రం నుంచి అందాల్సిన సహాయ, సహకారాలు ఎన్నడూ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను సైతం కేంద్రం తుంగలో తొక్కిందని, ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, విద్యా సంస్థల ఏర్పాటు లాంటి హమీలన్నీ గాలికి వదిలిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ ఐటీ ఎగుమతులు సుమారు 57 వేల కోట్లు ఉంటే, దాన్ని ఇవ్వాళ అవి లక్షా 40 వేల కోట్లకు చేరాయని, ఇంత ప్రగతి సాధిస్తున్నా కేంద్రం నుంచి ప్రత్యేక ప్రోత్సాహం కరువైందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సింగల్ ఫార్మా క్లస్టర్ అయినా హైదరాబాద్ ఫార్మా సిటీని చేపట్టినా కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభించడం లేదని, హైదరాబాదులో అద్భుతమైన ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకో సిస్టం ఉన్నా కేంద్రం తలపెట్టిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లలో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదని తెలిపారు.


Next Story

Most Viewed