ఎల్లంపల్లి భూ నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. మంత్రి చొరవతో..!

by  |
koppula
X

దిశ, వెల్గటూర్ : ఎట్టకేలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన మండలంలోని వెంకట్రావు పేట గ్రామానికి ముంపు పరిహారం డబ్బులు మంజూరయ్యాయి. ఈ మేరకు 488 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కాగా, నష్టపరిహార డబ్బులు మంజూరు కావడం పట్ల నిర్వాసితులు, సర్పంచ్ యాగండ్ల తిరుపతి, ఎంపీటీసీ మూగల రాజేశ్వరి సత్యం ఆనందం వ్యక్తం చేశారు. నిధుల మంజూరీకి కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వివరాల్లోకివెళితే.. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలంలోని వెంకట్రావు పేట గ్రామం ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైంది. కాగా, మొదట్లో 97 కుటుంబాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని వారికి గ్రామ శివారులో స్థలాలను కేటాయించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద డబ్బులు అందజేశారు.

గ్రామంలో అంతర్గత కలహాల మూలంగా సయోధ్య కుదరకపోవడంతో అందరికీ నష్ట పరిహారం అందడం అడ్డంకిగా మారింది. నష్టపరిహారం విషయంపై పలుమార్లు జేసీ, ఆర్డీవో గ్రామాన్ని సందర్శించి బాధితులకు నచ్చచెప్పినా పరిష్కారం మాత్రం లభించలేదు.ఈ మేరకు గ్రామ సర్పంచ్ యాగాండ్ల తిరుపతి, ఎంపీటీసీ మూగల రాజేశ్వరి సత్యం బాధితులకు సంబంధించిన సమస్యను మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకుపోయారు. దీనిపై స్పందించిన మంత్రి గ్రామంలో సమావేశం నిర్వహించి అర్హులైన నిర్వాసిత కుటుంబాల నివేదికను తయారు చేయించి ప్రభుత్వానికి అందజేసి నిధులను మంజూరు చేయించారు. ఈ మేరకు 488 కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున నష్టపరిహారం అందనుంది. కాగా దశాబ్దం నాటి కల నెరవేరడంతో నిర్వాసితులు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


Next Story

Most Viewed