చింతమడక గ్రామ పునర్నిర్మాణ ప్రగతి పనులపై సమీక్ష

by  |
చింతమడక గ్రామ పునర్నిర్మాణ ప్రగతి పనులపై సమీక్ష
X

దిశ, మెదక్: సీఏం కేసీఆర్ స్వగ్రామ చింతమడక, మధిర గ్రామస్తులంతా.. ఒకే మాట, ఒకే బాటపై నడవాలి! గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల ఐక్యతతో కలిసి పని చేసి సీఏం కేసీఆర్ సంతోషపడేలా అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దాం.! చింతమడక గ్రామ అభివృద్ధి దేశంలోనే మోడల్ గా నిలిచేలా జరపాలని నిశ్చయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ చెప్పారు. సిద్ధిపేట కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, దమ్మ చెరువు, అంకంపేట గ్రామాల పునర్నిర్మాణ ప్రగతి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వారం రోజులలోపు చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, గ్రామాల్లోని ఇళ్లను పూర్తిస్థాయిలో తొలగించాలని, తొలగించిన ఇళ్లకు వెంటనే జిల్లా కలెక్టర్ గారిచే ఆర్థిక సాయం అందిస్తారని మంత్రి తెలిపారు. చింతమడకలో ఇప్పటికే పలుచోట్ల ఇళ్లను కూల్చివేశారని, మిగిలిన ఇళ్ల కూల్చివేతకు గ్రామ ప్రజా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. అంకంపేట, దమ్మచెరువు గ్రామాల్లోని నిర్మాణ పనులను జూన్ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు. మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాల్లో నిర్మాణ పనుల పురోగతి జాప్యంపై ఏజెన్సీ ప్రతినిధులను మంత్రి ఆరా తీయగా.. కరోనా ప్రభావంతో ఆలస్యమైందని, ఈ వారం రోజుల్లోపు కూలీలను తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తామని ఏజెన్సీ ప్రతినిధి మంత్రికి హామీ ఇచ్చారు. గ్రామాన్ని మెచ్చుకునే విధంగా మన వ్యవహారశైలి ఉండాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచిస్తూ ఐక్యతతో ముందుకు వెళ్దామని మంత్రి పేర్కొన్నారు. ఈ సమీక్షలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్డీఓ అనంత రెడ్డి, తహశీల్దార్ పరమేశ్వర్, ఏంపీడీఓ సమ్మిరెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు రామ చంద్రం, శ్రీనివాస్ రెడ్డి, చింతమడక సర్పంచ్ హంసకేతన్ రెడ్డి, ఇతర గ్రామ సర్పంచ్ లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed