కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై హరీష్​రావు ఆగ్రహం

by  |
కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై హరీష్​రావు ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎయిమ్స్‎పై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీష్​ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు వక్రీకరిస్తున్నారని తెలిపారు. పూటకో మాటతో పబ్బం గడుపుతున్నట్లు ఆయన శనివారం మీడియాకు వివరించారు. ఇటీవల భూమి ఇవ్వలేదని చెప్పగా, సంబంధిత ల్యాండ్​ డాక్యూమెంట్​ చూపించామన్నారు. ఇప్పుడేమో బిల్డింగ్​ డాక్యూమెంట్లు, వాతావరణ క్లియరెన్స్ లేవని అంటున్నారని మంత్రి వివరించారు. బాధ్యతగల స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం సరైన విధానం కాదన్నారు. వాస్తవంగా ఎయిమ్స్ విష‌యంలో ఈ ఏడాది అక్టోబర్9 న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కి కేంద్రం లేఖ రాసిందన్నారు. దీన్ని సంబంధిత శాఖ‌ల‌తో సమన్వయం చేసి వారం రోజుల్లో టీఓఆర్ ఇచ్చేలా కృషి చేశామన్నారు. తమ ప్రభుత్వం ఎలాంటి పట్టింపులకు పోకుండా భూమిని అప్పగించామన్నారు. ఇప్పటికే సుమారు 201 ఎక‌రాల భూమిని ఎయిమ్స్ కొరకు అప్పగించామన్నారు.

45 కోట్లు ఖర్చు చేశాం..

వైఎస్సార్ హయాంలో ఎయిమ్స్ బీబీ నగర్ నిర్మాణం జరిగిందని, కానీ టీఆర్‌‌ఎస్​ప్రభుత్వం వచ్చాక కట్టడంలో ఆలస్యం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చేసే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అప్పట్లో కేవలం పాక్షిక పనులు మాత్రమే జరిగాయన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏకంగా 45 కోట్లు ఖ‌ర్చు చేసి ఆసుప‌త్రిని వినియోగంలోకి తెచ్చిందన్నారు. ఓపీ, డ‌యాగ్నోస్టిక్ సేవ‌ల‌ను వేగంగా ప్రారంభించిందన్నారు.


Next Story