ట్రబుల్ షూటర్.. టార్గెట్ బీజేపీ?

by  |
ట్రబుల్ షూటర్.. టార్గెట్ బీజేపీ?
X

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక పోరులో టీఆర్ఎస్ నుంచి అన్నీ తానై చూసుకుంటున్న ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు టార్గెట్ బీజేపీయేనని తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ మంత్రి ఫోకస్ ఎక్కువగా కమలనాథులపైనే పెడుతున్నారు. ఇటీవల ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం పెరిగాయి. టీఆర్ఎస్ రోజుకో నాయకుడి చేత ప్రెస్‌మీట్ పెట్టించి బీజేపీ నేతల సవాళ్లకు ప్రతి సవాళ్లను విసురుతోంది. రోజురోజుకూ బీజేపీతో ఫైట్ టైట్ అవుతుండడంతో సోమవారం ఏకంగా హరీశ్ రావు కూడా మీడియా సమావేశం నిర్వహించి ఆ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ‘కమలం’ దూకుడు పెరిగి ‘గులాబీ’లో గుబులు మొదలైందని, నియోజకవర్గంలో ‘కారు’ స్పీడ్ క్రమంగా తగ్గుతోందని స్థానికంగా చర్చ నడుస్తోంది.

దుబ్బాక ఉప పోరులో టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీనిస్తోంది. ట్రబుల్ షూటర్ వ్యూహాలకు బీజేపీ ప్రతివ్యూహం రచిస్తూ ఎన్నికల ప్రచారంలో ఊహించని విధంగా దూసుకుపోతున్నది. అధికార పార్టీ ఆగడాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కమలనాథులతో మంత్రికి పెద్ద తలనొప్పిగా మారింది. టీఆర్ఎస్ ఎన్ని ఎత్తులేసినా బీజేపీ తన ఘాటైన మాటలతో, దీటైన ప్రసంగాలతో ఎదుర్కొంటూ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తోంది. ఇటీవల రెండు పార్టీల నాయకులు వాడీవేడీగా కామెంట్లు చేసుకుంటుండడంతో నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, దుబ్బాక మహిళ కౌన్సిలర్లు, చైర్మన్.. ఇలా రోజుకో నాయకుడి చొప్పున మీడియా సమావేశాలు నిర్వహించి ఇతర పార్టీలను కాకుండా బీజేపీనే టార్గెట్ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. వీరితో మీడియా సమావేశం పెట్టినా ప్రజలపై, ప్రత్యర్థులపై అంత ప్రభావం చూపడంలేదని గమనించిన ట్రబుల్ షూటర్ చివరకు తానే ప్రెస్ మీట్ పెట్టాడు.

సోమవారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని సైతం వివరించకుండా బీజేపీపైనే విమర్శల వర్షం కురిపించారు. అయితే 2018 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా బాధ్యతతో పాటు గద్వాల, నల్గొండ , కొడంగల్ లాంటి ఉద్దండుల నియోజక వర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలోనే ప్రెస్ మీట్ పెట్టని హరీశ్ రావు, టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఒకమెట్టు దిగొచ్చి తానే ప్రెస్ మీట్ పెట్టడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. దీన్ని బట్టి మంత్రికి కూడా టీఆర్ఎస్ ఓటమి భయం పట్టుకుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

హరీశ్ రావు గ్రాఫ్ తగ్గుతోందా?

ట్రబుల్ షూటర్, ఆరడుగుల బుల్లెట్, ఉప ఎన్నికల వ్యహ కర్త అనగానే గుర్తొచ్చేది మంత్రి హరీశ్ రావు పేరు. తనకు అప్పగిస్తే ఎన్నిక ఏదైనా పక్కాగా గెలిపించుకోవడంలో ఆయన మంచి దిట్ట అనే పేరుంది. సీఎం కేసీఆర్‌కు నమ్మిన బంటుగా ఉన్న మంత్రి హరీశ్ రావు గ్రాఫ్ కమ్రంగా తగ్గుతోందని తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలు సరిగా నెరవేర్చకపోవడం, కార్యకర్తలను పక్కన పెట్టడం, పార్టీలో చేర్చుకున్న నాయకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం లాంటి అనేక అంశాలు హరీశ్ రావుపై ఉన్న నమ్మకాన్ని తగ్గించాయని స్థానికంగా పలువురు చర్చించుకుంటున్నారు. ఎన్నికల వేళ ఇచ్చే హామీలే తప్ప అవి మళ్లీ ఎన్నికలు వచ్చిన కానీ అమలుకు నోచుకోవనే ఆలోచనలో దుబ్బాక ప్రజలు ఉన్నట్లు అర్థమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయకపోగా ఈ ఎన్నికల్లోనూ మళ్లీ అవే మాటలు చెబుతుండడంతో ఇక వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలుస్తోంది.



Next Story

Most Viewed