ఆపరేషన్ హుజురాబాద్.. ఈటల నెక్ట్స్ స్టెప్ ఏంటీ?

179

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఈటల రాజేందర్ ఎపిసోడ్ తరువాత టీఆర్ఎస్ అధిష్టానం హుజురాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించింది. నియోజకవర్గంలోని పార్టీ కేడర్‌తో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ తమవైపుకు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది. రోజుకో మండలం, మునిసిపాలిటీల వారీగా ప్రత్యేకంగా రివ్యూలు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఆపరేషన్ హుజురాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యేందుకు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఉప ఎన్నికలు వచ్చినా రాకున్నా హుజురాబాద్‌లో ఈటల వర్గానికి చెక్ పెట్టే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే హుజురాబాద్, ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక మండలాలకు చెందిన పలువురు కేడర్‌తో ప్రత్యేకంగా గుంగుల సమావేశం అయ్యారు.

ఏటీఎంలా టచ్‌లో ఉంటా..

హుజురాబాద్ నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జి లేడన్న ఫీలింగ్‌లో ఉండవద్దని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గానికి కావాల్సిన నిధులైనా, పార్టీ పరంగా అవసరాలే అయినా ఏ విషయంలోనైనా తనను సంప్రదించాలన్న భరోసా కల్పిస్తున్నారు. తనకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని ఏనీ టైం మినిస్టర్ ( ఏటీఎం)లా సేవలందించేందుకు సిద్దంగా ఉంటానని హుజురాబాద్ కేడర్‌కు చెప్తున్నారు.

పెండింగ్ పనులపై గురి..

నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించిన వివరాలను మంత్రి గంగుల కమలాకర్ సేకరిస్తున్నారు. ఆ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధించిన శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరో వైపు ఏఏ అభివృద్ధి పనులు అవసరమో వాటి వివరాలను కూడా సేకరిస్తన్నారు. వాటికి కూడా నిధులు ఇప్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు మంత్రి.

కేటీఆర్ టూర్..

హుజురాబాద్‌లో త్వరలో మంత్రి కేటీఆర్ పర్యటించే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని పార్టీ కేడర్, ప్రజాప్రతినిధులందరినీ గంగుల కమలాకర్ సమీకరించిన తరువాత కేటీఆర్ టూర్ ఉండే అవకాశాలు కనిపిసిస్తున్నాయి. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్ కూడా సూత్ర ప్రాయంగా హుజురాబాద్ కౌన్సిలర్లతో వెల్లడించినట్లు సమాచారం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..