మెదడును మెలిపెట్టే ‘డార్క్’ సిరీస్

by  |
మెదడును మెలిపెట్టే ‘డార్క్’ సిరీస్
X

‘నా తల్లితో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి కొడుకు నాకు కన్నతండ్రి’.. అర్థం కాలేదా? మళ్లీ చదవండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న డార్క్ సిరీస్‌లో జోనస్ చెప్పే డైలాగ్ ఇది. జోనస్ తల్లి హన్నాకు, ఉల్రిచ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంటుంది. ఆ ఉల్రిచ్ చిన్న కొడుకు మిఖేల్.. జోనస్‌కు కన్నతండ్రి, హన్నాకు భర్త. అయినా అర్థం కాలేదా? ఉల్రిచ్ కూతురు మార్తా, జోనస్‌కు గర్ల్‌ఫ్రెండ్. ఇలా చెప్పుకుంటూ పోతే బుర్రలు బద్ధలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ సిరీస్‌కు అపారమైన క్రేజ్. ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యమైందనుకుంటున్నారు? టైమ్ ట్రావెల్. ఎంత టైమ్ ట్రావెల్ కారణమైనప్పటికీ ఎవరు ఎవరికి ఏమవుతారో, ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం ముంచుకొస్తుందో అనే ఉత్కంఠ ఈ సిరీస్‌ని ఆసక్తికరంగా చేస్తోంది. త్వరలో ఈ సిరీస్ మూడో సీజన్ విడుదల కాబోతుండగా.. ఇప్పటికే విడుదలైన మూడో సీజన్ ట్రైలర్ కొత్త ప్రశ్నలకు తెరదీసి మరింత ఆసక్తిని పెంచింది.

విండెన్ నగరంలో ఒక గుహ ఉంటుంది. అక్కడి న్యూక్లియర్ ప్లాంటులో జరిగిన ప్రమాదం కారణంగా ఆ గుహలో ఒక వార్మ్‌హోల్ ఏర్పడుతుంది. ఆ వార్మ్‌హోల్ గుండా ప్రయాణిస్తే 33 ఏళ్లు గతంలోకి, 33 ఏళ్లు భవిష్యత్తులోకి వెళ్లొచ్చు. అలా ఆ గుహ గుండా వెళ్లిన ఉల్రిచ్ కొడుకు మిఖేల్, గతంలో హన్నాను పెళ్లి చేసుకుని జోనస్‌కు తండ్రి అవుతాడు. ఇలాంటి తికమక సంబంధాలు ఈ సిరీస్‌లో చాలా ఉంటాయి. ఆ వార్మ్‌హోల్ గుండా మిఖేల్, జోనస్, ఉల్రిచ్, హన్నా, ఉల్రిచ్ భార్య కేథరీన్… ఇలా చాలా మంది ప్రయాణిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో కాలంలో ఇరుక్కొని కొత్త సమస్యలు సృష్టిస్తారు. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు, చెప్పలేము, చెప్పినా అర్థం కాదు.

నెరేషన్ స్లోగా అనిపిస్తున్నా.. కొంచెం ఓపిక చేసుకుని చూడగలిగితే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఎక్కడ మొదలైందో అక్కడ అంతమవుతుందనేది ఈ సిరీస్ సారాంశం. రానున్న మూడో సీజన్ ఈ సిరీస్‌లో చివరిది. మొదటి, రెండు సీజన్లలో తలెత్తిన ప్రశ్నలకు ఈ మూడో సీజన్ సమాధానం చెబుతుందని అందరూ అనుకున్నారు. కానీ మూడో సీజన్ ట్రైలర్ చూశాక చాలా మందికి కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఒక వ్యక్తి మూడు కాలాలకు చెందిన అతనితోనే మాట్లాడి రాబోయే విధ్వంసాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ విధ్వంసం ఆపడం ఏమో గానీ చూసే వాడి మెదడులో కచ్చితంగా ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఒకానొక సమయంలో ఎవరు ఏది, ఏ కాలానికి చెందినవారో తెలుసుకోవడానికి నోట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా వస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

జర్మన్ భాషలో నేరుగా విడుదలైన మొదటి జర్మన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఇది. ఇంగ్లిష్ భాషలో కూడా ఉంటుంది. కానీ జర్మన్ ఆడియోతో చూస్తూ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ పెట్టుకుని చూస్తే మంచి మజా వస్తుంది. ప్రతి ఎపిసోడ్ ఒక క్లైమాక్స్‌లాగా ఉంటుందని చెప్పలేం, కానీ ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ మాత్రం ఇంకో ఎపిసోడ్ చూడాలనిపించేలా ఉంటుంది. అందుకే మూడో సీజన్ వచ్చేలోగా మొదటి రెండు సీజన్లు చూసేస్తే ఓ పని అయిపోతుంది. కానీ చూడటం కూడా చాలా శ్రద్ధగా, ఓపికగా చూడాలి. లేదంటే మధ్యలోనే బోర్ కొట్టి వదిలేయాలనిపిస్తుంది. థ్రిల్లర్, ఫాంటసీ, టైమ్ ట్రావెల్ కథలు ఇష్టపడేవారు ఇది తప్పకుండా చూడాల్సిన సిరీస్. కాగా, జూన్ 23న డార్క్ మూడో సీజన్ విడుదల కాబోతోంది.


Next Story

Most Viewed