ఇదే బీజేపీ కల్చరంటున్న అసదుద్దీన్..

by  |
ఇదే బీజేపీ కల్చరంటున్న అసదుద్దీన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఒకరిపైనొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్యే మాటల తూటాలు పేలుతున్నాయి. మేయర్ సీటు పై కన్నేసిన గులాబీ, కాషాయ పార్టీలు ప్రచారాన్నిహోరెత్తిస్తున్నాయి.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేయడమే కాకుండా, రోడ్ షో నిర్వహించి బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రసంగంలో ఎక్కువ భాగం ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల రహస్య పొత్తుపై విమర్శలు గుప్పించారు. తాజాగా దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

‘నగరంలోని పాతబస్తీలో 30వేల మంది రోహింగ్యాలు అక్రమంగా నివాసముంటున్నారని.. వారిని ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు కాపాడుతున్నాయని అమిత్ షా అంటున్నారు. అందులో కనీసం వెయ్యి మంది పేర్లన్నా చెప్పాలని.. ఒకవేళ నిజంగా వాళ్లు ఉంటే కేంద్ర హోంమంత్రిగా మీరు ఏం చేస్తున్నారని అసద్ ప్రశ్నించారు. వారి పేర్లను నన్ను రాసి ఇవ్వాలని అంటున్నారు.. నేను ఎందుకు రాసిస్తా? అని హైదరాబాద్ ఎంపీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తానని అంటున్నారని.. ఇదే బీజేపీ కల్చర్ అని’ విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో నోరు జారిన బీజేపీ పైన డిసెంబర్ -1న ప్రజాస్వామికంగా దాడి చేస్తామని అసద్ వెల్లడించారు. ఇదిలాఉండగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. భారత ప్రధాని విమానంలో వచ్చి వ్యాక్సిన్ ఎలా తయారవుతుందో చూసెళ్లారని.. ఇక యోగి సొంత రాష్ట్రం యూపీలో జరిగిన హాథ్రస్ ఘటనను ఎవరూ మరిచిపోలేదన్నారు.ముందు అక్కడ దళితులు, పేదలపై అఘాయిత్యాలను ఆపాలని అసద్ డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed