జడ్జిగా.. దూద్‌వాలా డాటర్.!

by  |
జడ్జిగా.. దూద్‌వాలా డాటర్.!
X

దిశ, వెబ్‌డెస్క్: చాలామంది తమ లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి అనేక కారణాలుంటాయి. అయితే కొందరు మాత్రం లక్ష్యాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే.. వెనుకంజ వేయకుండా విజేతలుగా నిలిచి, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. రాజస్థాన్, ఉదయ్‌పూర్‌కు చెందిన ‘సోనాల్ శర్మ’ కూడా అలాంటి టాలెంటెడ్, గోల్ ఓరియెంటెడ్ వ్యక్తి. దూద్‌వాలా కూతురిగా తండ్రికి సాయం చేస్తూనే, మొదటి ప్రయత్నంలోనే జడ్జిగా ఎంపికైన సోనాల్ స్టోరీ మీ కోసం..

పట్టుదల, సంకల్పం ముందు కొండంత లక్ష్యం చిన్నబోతుందనేందుకు సోనాల్ స్టోరీనే నిదర్శనం. సోనాల్ తండ్రి పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుండగా, తండ్రితో కలిసి తను కూడా పశువుల పాకలో నిరంతరం శ్రమించేది. పశువుల కొట్టాన్ని క్లీన్ చేయడం, పేడ ఎత్తడం, పాలు పితకడం, పాలు పోయడం వంటి పనులన్నీ చేస్తూ.. అదే పాకలో తన లక్ష్యం కోసం కష్టపడి చదివేది. ఆ క్రమంలోనే 26 ఏళ్ల సోనాల్.. బీఏ, ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్‌లో టాప్ ర్యాంకర్‌గా నిలిచి మూడు బంగారు పతకాలు సాధించింది. ఎల్‌ఎల్ఎమ్ పూర్తి చేసిన తర్వాత రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీస్ (ఆర్‌జేఎస్)‌కు సొంతంగా ప్రిపేర్ కాగా, ఎక్స్‌పెన్సివ్ బుక్స్ కొనే స్థోమత లేకపోవడంతో సైకిల్ మీద కాలేజ్‌కు వెళ్లి లైబ్రరీలో చదువుకునేది. ఆమె చదువు పట్ల చూపిన డెడికేషన్, డిటర్మినేషన్ వృథా పోలేదు. తొలి ప్రయత్నంలోనే ఆర్‌జేఎస్ క్రాక్ చేసి రాజస్థాన్ సెషన్స్ కోర్టులో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా నియమితురాలైంది.

‘నలుగురు పిల్లలమైన మమ్మల్ని చదివించడానికి నాన్న ఎంతగానో కష్టపడ్డ నాన్న.. అందుకోసం లోన్లు కూడా తీసుకున్నారు. కానీ ఎప్పుడు కూడా ఆడిపిల్లలకు చదువు ఎందుకనే కంప్లయింట్ చేయలేదు. చిన్నప్పుడు స్కూల్లో ఉండగా, మాది పాల వ్యాపారం చేసే కుటుంబం అని చెప్పుకోవడానికి సిగ్గుపడేదాన్ని. కానీ నేడు మా నాన్న ఓ దూద్‌వాలా అని గర్వంగా చెప్పుకుంటాను. నా విజయం నాన్నకు మాటల్లో చెప్పలేని సంతోషాన్నిచ్చింది. ఇక మా నాన్నకు ఏ కష్టం రాకుండా చాలా సంతోషంగా చూసుకుంటాను’ అని సోనాల్ తెలిపింది.

సోనాల్ స్టోరీ చదివిన తర్వాత.. మన డ్రీమ్స్, గోల్స్ సాధించడం చాలా కష్టంగా అనిపిస్తుందా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీ లక్ష్యాన్ని చేరుకోనివ్వని సాకులు, కారణాలు చెప్పుకోవడం ఆపి, మీ గెలుపును ఇతరులు చెప్పుకునేలా ప్రయత్నం చేయండి.. తప్పక విజయం దక్కుతుంది.


Next Story

Most Viewed