మందుపాత‌ర‌లు పెడుతూ… మిలీషియా సభ్యుల అరెస్టు

by  |
మందుపాత‌ర‌లు పెడుతూ… మిలీషియా సభ్యుల అరెస్టు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ములుగు జిల్లాలో ఏడుగురు నిషేధిత మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నూగురు వెంకటాపురం మండల పరిధిలోని పామునూరు అటవీ ప్రాంతంలో పేలుడు సామ‌గ్రిని అమరుస్తుండగా వారిని అరెస్ట్ చేసిన‌ట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పాటిల్ తెలిపారు. భారీ స్థాయిలో పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మీడియా స‌మావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. మావోయిస్ట్ పార్టీకి చెందిన కీల‌క నేత‌లైన యాప నారాయణ అలియాస్‌ హరిబూషన్, బడే చొక్కా రావు అలియాస్ దామోదర్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకన్న ఆదేశాలతోనే వారు విధ్వంసానికి ప్రయ‌త్నించిన‌ట్లుగా తెలిపారు.

పోలీసులను హ‌త‌మార్చడ‌మే ల‌క్ష్యంగా పేలుడు ప‌దార్థాల‌ను అమ‌రుస్తున్నట్లుగా విచారణలో మిలీషియా స‌భ్యులు తెలిపిన‌ట్లు పేర్కొన్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఏటూరునాగారం, వెంక‌టాపురం సీఐలు, బీడీ టీం, సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో క‌లిసి పామునూరు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ప్రత్యేక పోలీసు బ‌ల‌గాల‌కు మిలీషియా స‌భ్యులు తార‌స‌ప‌డటంతో అరెస్టు చేసినట్టు తెలిపారు. మొత్తం ఏడుగురు స‌భ్యుల‌ను పేలుడు ప‌దార్థాల‌తో స‌హా ప‌ట్టుకున్నట్టు తెలిపారు. అరెస్టయిన వారిలో మిలిషియా వెంక‌ట‌పురం క‌మాండ‌ర్‌ ఉండం పాండు, డిప్యూటీ కమాండర్ ముచ్చకీ భీమయ్య, సోడి లక్ష్మయ్య అలియాస్ లక్మ, మడకం అలియాస్ మడవి అడమయ్య, మడవి బుద్ర, మడవి ఐతయ్య, మడవి కోసలు గ‌త ఏడు సంవ‌త్సరాలుగా మావోయిస్ట్ పార్టీకి సానుభూతిపరులుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల‌ను కోర్టులో రిమాండ్ చేయ‌నున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed