వలస కార్మికులు ప్రభుత్వానికి అలుసాయెనా.!

by  |
వలస కార్మికులు ప్రభుత్వానికి అలుసాయెనా.!
X

అందని సాయం, దాతల పొట్లాలకు ఎదురు చూపులు

దిశ, న్యూస్‌ బ్యూరో:
నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో వలస కార్మికులు ఆకలితో అల్లాడిపోతున్నారు. తినడానికి తిండిలేక..సొంత గూటికి చేర లేక..ఇక్కడ తమకంటూ ఆపదలో ఆదుకునే వారు లేక ఆపసోపాలు పడుతున్నారు. రోడ్ల మీద అన్నదాతల పంపిణీ చేసే అన్నం పొట్నాల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వారు ఇచ్చే ప్యాకెట్లతో ఆ కుటుంబాలు కడుపు నింపుకుంటున్నాయి. ఇన్ని అవస్థలు పడుతున్న తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వలస కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం, ఆర్థిక సాయం తమకు అందడం లేదని పలువురు చెబుతున్నారు. తమకు అందేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్న కార్మికులు ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఎక్కువ మొత్తంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 1 లక్షా 70 వేల మంది ఉన్నారు. జనతా కర్ఫ్యూ మొదలు నేటి వరకు వీరికి పని లేకపోవడంతో వీరి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వం రాష్ట్రంలో ఆకలి కేకలు వినిపించకూడదని గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తోంది. కాని ఆకలి మంటలను చల్లార్చడం లేదు.

వలస కార్మికులకు 12 కిలోల బియ్యం, రూ.500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసి 20 రోజులు గడుస్తున్నా నేటికి ఆ ప్రక్రియను ముమ్మరం చేయడంలో జాప్యం నెలకొంది. ఇతర రాష్ట్రాలు ఒడిస్సా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకొని బతుకు దెరువు కోసం వచ్చిన కార్మికులు ప్రభుత్వం సాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ బియం ఎప్పుడు వస్తాయో..ఆకలి ఎప్పుడు తీరుతుందోనని కాలం వెల్లబుచ్చుతున్నారు.

పిల్లలకు పాలు కొందామన్న రూపాయి లేదు

కరోనా రోగం వచ్చుడేమో గాని మా పిల్లలు ఆకలితో కండ్ల ఎదుట అల్లాడుతుంటే చూడ‌లేక మా ప్రాణాలే పోయేటట్లు ఉన్నాయి. మూడు వారాల నుంచి పనులు లేవు. తినడానికి తిండి లేదు. యజమానులు డబ్బులు అడిగిన ఇచ్చే పరిస్థితి లేదు. మా సేటుకు ఫోను చేస్తే ఎత్తడం లేదు. కిరాణం షాపులో ఇప్పటికే రూ.4వేల వరకు అప్పులైనవి. ఇక అప్పు ఇచ్చేది లేదంటు షావుకారి ముఖం మీదనే చెబుతాండు. రేపటి నుంచి ఎక్కడకు పోవలో అర్థం కవాడం లేదు. మధ్యాహ్నం పూట రోడ్డు మీదికి పోయి దాతలు ఇచ్చే ప్యాకెట్లు తెచ్చుకుని పూట గడుపుకుంటున్నాం. ఇక రాత్రి సమయంలో కడుపు మాడ్చుకొని పడుకోవాల్సిందే. నేను ఇక్కడా 12 ఏండ్లుగా ఆటోనగర్ ట్రాన్స్‌పోర్టు హమాలీగా పని చేస్తున్న. ఎన్నడు ఇలాంటి గోస రాలేదు. తెలంగాణ ప్రభుత్వం మా బాధలు ఆర్థం చేసుకుని ప్రకటించిన బియ్యం తొందరగా అందిస్తే ఈ గడ్డుకాలం నుంచి బతికి బయట పడుతాం లేదంటే.. మాకు గోరి కట్టాల్సిందే.
– ప్రేమ్, వలస కార్మికుడు, మహారాష్ట్ర

నా భార్య గర్భిణి, సొంత ఊరుకి పంపించండి..

లాక్‌డౌన్‌కు రెండ్రోజుల ముందు ఇంటికి పోదామని ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న. మార్చి 29వ తేదీన పోవాల్సింది లాక్‌డౌన్‌తో ట్రైన్లు నిలిచిపోయినవి. ఇంటికి పోయే పరిస్థితి లేదు. నా భార్య 8నెలల గర్భిణి. రెండేండ్ల చిన్న పాప ఉంది. వీరికి బుక్కెడు బువ్వపెట్టలేక పోతున్న. లాక్‌డౌన్ నుంచి పనిలేక చేతుల చిల్లిగవ్వ లేదు నిన్నమొన్నటి వరకు పనిచేసిన డబ్బులు రూ.2వేలు ఉంటే సర్దుకున్నం. అవి అయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో తినడానికి గింజ కూడా లేదు. రెండ్రోజుల నుంచి బయట అక్కడా, ఇక్కడా దాతలు ఇచ్చే అన్నం ప్యాకెట్లు తెచ్చుకుని తింటున్నాం. ఇట్ల ఎన్నాళ్లని తినాలి. ప్రభుత్వం మాకు ఇప్పటి వరుకు ఏ సాయం చేయలేదు. ఇస్తామన్న బియ్యం, రూ.500 ఇంకా రాలేదు. ఎప్పుడు ఇస్తారో ఏమో కాని సొంత ఊరికి పంపిస్తే అంతే చాలు ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. గర్భిణితో ఇక్కడ ఉండటం కష్టంగా ఉంది. ఇక్కడ మాకు ఎవరూ లేరు. రోజూ ప్రాణాలు ఆరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమని బతకాల్సి వస్తోంది.

– వీరస్వామి, వలస కార్మికుడు, శ్రీకాకుళం

Tags: Migrant Workers, Waiting, government help, 12 kg rice, money, hungry


Next Story

Most Viewed