- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి ఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. ఈసారి ఎంతమందిని తొలగించిందంటే?
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులను ఊచకోత కోసింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. సంస్థ నిర్వహణను పునర్వ్యవస్థీకరించడంకోసం దాదాపు 300 మందికిపైగా ఉద్యోగులకు లేఆఫ్స్ (layoffs) ప్రకటించినట్లు తెలిసింది. ఈ తొలగింపులు ప్రధానంగా అమెరికాలోని వాషింగ్టన్ కార్యాలయం నుంచి జరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పరిణామాల దృష్ట్యా సంస్థ వ్యూహాల్లో మార్పులు చేస్తోందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ మార్పుల క్రమంలో తీసుకున్న చర్యల్లో భాగంగానే తాజా ఉద్యోగ తొలగింపులు చోటుచేసుకున్నాయి.
ఇక మైక్రోసాఫ్ట్ తాజా లేఆఫ్స్ ఏ విభాగాల్లో జరిగాయో అధికారికంగా వెల్లడించలేదు. అయితే, గత నెలల లేఆఫ్స్ ఉదాహరణలను బట్టి చూస్తే, ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు వంటి టెక్నికల్ విభాగాల ఉద్యోగులపై అధిక ప్రభావం పడే అవకాశముంది. అలాగే, తాజా ఉద్యోగ కోతలు సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 1 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు ది సియాటిల్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఇదే మైక్రోసాఫ్ట్ గత నెలలో (మే 2025) సైతం దాదాపు 6,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇది మొత్తం ఉద్యోగులలో సుమారు 3 శాతం మేరకు ఉంటుంది. ఈ నిర్ణయం 2023లో 10,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మైక్రోసాఫ్ట్ చరిత్రలో రెండవ అతిపెద్ద ఉద్యోగ కోతగా నమోదైంది.
తొలగింపులపై సంస్థ ఏం చెప్పిందంటే.. 'వ్యవస్థను సరళతరం చేయడం, మేనేజ్‌మెంట్ స్థాయిలను కుదించడం వంటి చర్యల ద్వారా సంస్థ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం' అని తెలిపింది. ఇంతకముందు కూడా, 2025 జనవరిలో పనితీరు ఆధారంగా కొంతమందిని సంస్థ నుంచి తొలగించారు. ఇక జూన్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్‌లో మొత్తం 2,28,000 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 55 శాతం ఉద్యోగులు అమెరికాలో ఉన్నారు. ఈ క్రమంలో కంపెనీ వ్యూహాత్మక మార్పుల ప్రభావం మొదటగా యూఎస్ ఉద్యోగులపైనే పడేలా చేస్తోంది.
మైక్రోసాఫ్ట్ తీసుకుంటున్న ఈ చర్యలు కంపెనీ భవిష్యత్తు వ్యూహాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ఇది నిరాశ కలిగించే పరిణామమే. టెక్ పరిశ్రమలో ఏఐ ఆధారిత ఆటోమేషన్, ఖర్చు నియంత్రణ, సమర్థత పెంపు వంటి అంశాలే ప్రస్తుతం ఉద్యోగ భద్రతపై మేఘం వేసేలా చేస్తున్నాయి.






