'కరోనా బోనస్' ప్రకటించిన మైక్రోసాఫ్ట్

by  |
Microsoft Update
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అంతర్జాతీయంగా తన ఉద్యోగులందరికీ శుభవార్త ప్రకటించింది. అమెరికా సహా అన్ని దేశాల్లోని ఉద్యోగులకు ఒక్కోక్కరికీ 1,500 డాలర్లు(రూ. 1.12 లక్షలు) సింగిల్ టైమ్ బోనస్‌ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది. కొవిడ్ మహమ్మారి లాంటి సంక్షోభ సమయంలో ప్రతికూల సవాళ్లను ఎదుర్కొన్న ఉద్యోగుల కృషిని గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అయినప్పటికీ వారు కరోనా పరిస్థితులను అధిగమించి పని చేశారని కంపెనీ అభిప్రాయపడింది. కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ నుంచి కిందిస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఈ బోనస్‌ను అందించనున్నట్టు, ఈ ఏడాది మార్చి 31కి ముందు ఉన్న అందరికీ ఈ బహుమతి వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో పార్ట్‌టైమ్ వర్కర్లతో పాటు గంట చొప్పున పనిచేసే వారు కూడా ఉన్నారని కంపెనీ తెలిపింది.

మైక్రోసాఫ్ట్ సంస్థకు అంతర్జాతీయంగా మొత్తం 1.75 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరందరికీ బోనస్ ఇచ్చేందుకు కంపెనీ 200 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 1,500 కోట్లు)ను అదనంగా కేటాయించింది. అయితే, మైక్రోసాఫ్ట్ అనుబంధంగా పనిచేస్తున్న లింక్‌డ్ఇన్, జెనీమ్యాక్స్, గిట్‌హబ్ కంపెనీలోని ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించదని వివరించింది. కాగా, ఇప్పటికే ఫేస్‌బుక్ సంస్థ ఇదే కారణంతో తన 45 వేల ఉద్యోగులకు 1,000 డాలర్ల చొప్పున బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed