రిలయన్స్ జియోతో మైక్రోసాఫ్ట్ చర్చలు!

by  |
రిలయన్స్ జియోతో మైక్రోసాఫ్ట్ చర్చలు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలో జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి నెల రోజులుగా భారీ పెట్టుబడులు వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే మార్చి నాటికి రిలయన్స్ సంస్థను రుణ రహిత సంస్థగా మార్చాలనేది ముఖేశ్ అంబానీ లక్ష్యం. ఈ క్రమంలో జియో ప్లాట్‌ఫామ్స్‌లోని వాటాలను విక్రయిస్తున్నారు. ఇటీవల నాలుగు భారీ ఒప్పందాలను చేసుకున్న జియో సుమారు రూ.78వేల కోట్ల పెట్టుబడులను రాబట్టింది. తాజాగా మరో టెక్ దిగ్గజం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. జియోలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఇన్వెస్ట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. పలు డిజిటల్ సంస్థలతో మైక్రోసాఫ్ట్ సంస్థ చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.5 శాతం వాటాను కొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జియోతో మైక్రోసాఫ్ట్ సీఈవో చర్చలు జరుపుతున్నారని, తుది ఒప్పంద వివరాలు రానున్న రోజుల్లో వెల్లడవుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలు సఫలమైతే ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థ జియోలో వాటాను కొన్నట్లు అవుతుంది. గతంలో సత్య నాదేళ్ల ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో తమ కంపెనీ సేవలను మరింత విస్తరిస్తున్నట్టు, ముఖ్యంగా క్లౌడ్ సేవలను అందుకోవడానికి ఇండియా మొత్తం డేటా సెంటర్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజా చర్చల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.


Next Story

Most Viewed