ఇగ మేం గెలిచెందుకు.. ? మా కన్నా సఫాయి కార్మికులు నయం

by  |
Narsampeta1
X

దిశ, నర్సంపేట టౌన్: పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వ సభ్య సమావేశానికి ఎంపీపీ మోతే కళావతి అధ్యక్షత వహించగా ఎంపీడీఓ నాగేశ్వర్ రావు పర్యవేక్షించారు. ఈ సభలో సర్పంచులు సమస్యలు ఏకరువు పెట్టగా, అధికారులు వివరణ ఇచ్చారు. అయితే ప్రతిసారీ సమావేశంలో సమస్యలకు పరిష్కారం చూపకుండా సాగదీత ధోరణిని అవలంభిస్తున్నారు అని పలువురు సర్పంచులు ఆవేదన వెళ్లగక్కారు. మిషన్ భగీరథ పనుల విషయంలో సభలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం జరిగి, సవాల్ ప్రతి సవాళ్లు చేసుకున్నారు. అంగన్వాడీ భవనాలకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలని కోరగా అధికారులు జిల్లా పరిషత్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తహశీల్దార్ రాంమూర్తి మాట్లాడుతూ ధరణి పోర్టల్ పై సంతృప్తి వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థలో వికలాంగులు పడుతున్న అవస్థలను మొగ్దుంపురం సర్పంచ్ పెండ్యాల జ్యోతి ప్రభాకర్ ఎమ్మార్వో దృష్టికి తీసుకురాగా మానవతా దృక్పథంతో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రేమ వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం వర్తించదని ఎమ్మార్వో అన్నారు. ఉపాధిహామీ విభాగం విషయంలో సర్పంచులు ఒకింత అసహనానికి లోనయ్యారు. కూలీలను పని కోసం తరలిస్తూ పేమెంట్ల విషయంలో ఆపసోపాలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీకి సంబధించిన సాఫ్ట్ వేర్ మెరుగు పరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. జిల్లా కేంద్రంగా పనులు రూపొందించబడుతాయని ఏపీవో తెలుపగా సర్పంచులు ఇక మేమెందుకు అని కొంతమంది వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా గుంటూర్ పల్లి సర్పంచ్ కర్నాటి పార్వతమ్మ మాట్లాడుతూ మా కన్నా సఫాయి కార్మికులు నయం అని ఆవేదన వెళ్లగక్కారు. ఈ సభలో ఉచిత వంట గ్యాస్ కలెక్షన్లు ఎవరు ఇస్తారో తెలుపాలని, ఉపాధి హామీ పనులు గ్రామ కేంద్రంగా జరగాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు.


Next Story

Most Viewed